ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు పల్లె పోరుకు ప్రజల తీర్పు

1 రోజు క్రితం

Peoples verdict today in the rural electoral battle
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 04:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

81 పంచాయతీల్లో సర్పంచి ఎన్నికలు

95 పంచాయితీలకు గాను 14 పంచాయతీలు ఏకగ్రీవం

ప్రధాన పంచాయతీల్లో ఉత్కంఠభరిత పోటీ


ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పల్లె పాలనకు నాయకులను ఎన్నుకునే కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. పీలేరు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో ఆదివారం సర్పంచి ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి నెలకొంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తమ ఓటు ద్వారా నిర్ణయించనున్నారు. అధికార కూటమి, ప్రతిపక్ష వైకాపా బలపరిచిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా సాగించిన ప్రచారానికి ముగింపు పలకగా.. ప్రధాన పంచాయతీల్లో పోటీ తీవ్రంగా మారింది.


పీలేరు మండలంలో 15 పంచాయతీలు ఉండగా వాటిలో ఒక పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 14 పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా పీలేరు నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో మొత్తం 95 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 14 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కంభంవారిపల్లెలో ఐదు, వాల్మీకిపురంలో మూడు, కలికిరి, కలకడ మండలాల్లో రెండేసి, పీలేరు, గుర్రంకొండ మండలాల్లో ఒక్కొక్క పంచాయతీ ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 81 పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల్లో అభ్యర్థులు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.


పీలేరు, వాల్మీకిపురం, కలికిరి, గుర్రంకొండ తదితర ప్రధాన పంచాయతీల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. పీలేరులో కూటమి బలపరిచిన షేక్ రెహనా పర్వీన్ (కప్పు సాసర్), వైసిపి బలపరిచిన షేక్ ఆరిఫా (గంప) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వాల్మీకిపురంలో టిడిపి అభ్యర్థి రాజేంద్రాచారి, వైకాపా అభ్యర్థి కుమార్ యాదవ్ మధ్య పోటీ సాగుతోంది. చింతపర్తిలో తెదేపా అభ్యర్థి జమీరుద్దీన్, వైసిపి అభ్యర్థి వెంకటరమణతో పాటు వైసిపి రెబల్ అభ్యర్థి శ్రీనివాసులు కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది. కలికిరిలో టిడిపి అభ్యర్థులు వింధ్య, గాయత్రి మధ్య పోటీతో పాటు వైకాపా అభ్యర్థి షెబీనా కూడా బరిలో ఉండటంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. గుర్రంకొండలో కూటమి అభ్యర్థి రజియాబాను, వైసిపి అభ్యర్థి మెహరున్నీసా, కాంగ్రెస్ అభ్యర్థి నౌజీరా మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గ్రామపంచాయతీ సర్పంచి ఎన్నికలను పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించిన ఫలితాల తరహాలోనే మెజార్టీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా తమ రాజకీయ పట్టును నిలుపుకునేందుకు ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నారు.


ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ...

బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ పథకాల లబ్ధిని వివరిస్తూ ఓట్లు కోరగా.. వైకాపా అభ్యర్థులు ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల మద్దతు కోరారు. గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల పాత్ర కీలకంగా మారింది. ప్రచారంలో వ్యక్తమైన ఆదరణ ఓట్ల రూపంలో ఎంతవరకు ప్రతిఫలిస్తుందనే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. నేడు జరిగే పోలింగ్‌తో గ్రామాల్లో తదుపరి పాలకులెవరో తేలనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్