నామినేషన్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన - సిఐ కళా వెంకటరమణ
ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : రేపటి నుంచి జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను (ఎంపిటిసి) ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి. విశ్వనాధ్ సూచించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నామినేషన్ల స్వీకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసు బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఐ కళా వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించి, అవసరమైన వారిపై చట్టప్రకారం బైండోవర్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, గొడవలకు పాల్పడటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను బెదిరించడం లేదా ప్రలోభాలకు గురిచేయడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం నామినేషన్లు స్వీకరించే భవనాన్ని రిటర్నింగ్ అధికారి సి. విశ్వనాథ్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, అభ్యర్థులు, అధికారుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బావా జాన్, వీఆర్వోలు, ముఖ్య పార్టీ నేతలు అందరూ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)