ప్రజాశక్తి-గుజరాత్ : గుజరాత్‌లోని మారుమూల గ్రామం చందంకి. సాధారణ గ్రామాల మాదిరిగానే ఇరుకైన వీధులు, చిన్న చిన్న ఇళ్లు, గుడి, బడి ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఈ గ్రామంలో ఓ విశేషం ఉంది. ఇక్కడి ఇళ్లలో వంట పొయ్యిలు వెలగవు. వంట పాత్రల చప్పుడు వినిపించదు. అయినా గ్రామస్థులకు భోజనానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎందుకంటే ఊరంతటికీ ఒకే సామూహిక వంటశాల ఉంది. కొంతకాలంగా గ్రామంలోని ప్రజలందరికీ ఈ వంటశాల నుంచే భోజనం అందిస్తున్నారు.
వలసలతో ఒంటరిగా మిగిలిన వృద్ధులు ....
ఒకప్పుడు వెయ్యికిపైగా జనాభా ఉన్న ఈ గ్రామం నుంచి యువత చదువులు, ఉద్యోగాల కోసం సమీప పట్టణాలతోపాటు విదేశాలకూ వలస వెళ్లిపోయారు. దీంతో వారి వృద్ధ తల్లిదండ్రులు మాత్రమే గ్రామంలో మిగిలారు. సుమారు 500 మంది వృద్ధులు 70 నుంచి 80 ఏళ్ల వయసులో ఇక్కడ జీవిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా, కన్నబిడ్డలు దగ్గర లేకపోవడం, మనవళ్లు, మనవరాళ్లతో గడిపే అవకాశం లేకపోవడం వారిని ఒంటరితనానికి గురిచేసింది. వృద్ధాప్యం కారణంగా రోజూ వంట చేసుకోవడం కూడా కష్టంగా మారింది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఈ పరిస్థితులు వృద్ధులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి.
సర్పంచ్ వినూత్న ఆలోచన ....
వృద్ధుల కష్టాలను గమనించిన గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలో కొంతకాలం నివసించి వచ్చిన ఆయన, గ్రామంలో సామూహిక వంట శాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా వంటశాలను ప్రారంభించి, నిర్వహణ కోసం సిబ్బందిని నియమించారు. ఈ వంటశాల ద్వారా వృద్ధులకు రోజూ రెండు పూటల భోజనంతోపాటు స్నాక్స్ కూడా అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో గ్రామంలోని వృద్ధులంతా ఒకచోట చేరి గుజరాతీ సంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తున్నారు. ఈ సేవలను పొందేందుకు ఒక్కొక్కరు నెలకు రూ.2,500 చెల్లిస్తున్నారు.
భోజనంతోపాటు ఆత్మీయత ....
ఈ సామూహిక వంటశాల కేవలం ఆకలి తీర్చే కేంద్రంగా మాత్రమే పరిమితం కాలేదు. వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని నింపే వేదికగా మారింది. అందరూ కలిసి భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తమ కష్టసుఖాలను పంచుకుంటూ ఒంటరితనాన్ని మర్చిపోతున్నారు. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఆత్మీయ అనుబంధాలను పెంచుకుంటున్నారు.
ప్రారంభంలో గ్రామస్థులు ఈ విధానంపై పెద్దగా ఆసక్తి చూపకపోయినా, క్రమంగా దాని ప్రయోజనాలను గుర్తించారు. పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందుతుండటంతో వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడింది. ఇంట్లో వంట చేసుకోవాల్సిన శ్రమ తగ్గడంతో పాటు, తోటి వారితో కలసి గడిపే అవకాశం లభించడంతో మానసిక ఒత్తిడి కూడా తగ్గింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వృద్ధులే వంటశాలలో కలిసి తమకు ఇష్టమైన వంటకాలను తయారు చేసుకుంటున్నారు.
పిల్లలకు భరోసా.. ఇతర గ్రామాలకు ఆదర్శం ....
ఈ వంటశాల వ్యవస్థ ఆశ్రమాన్ని తలపించినా, వృద్ధుల స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ జీవించే అవకాశాన్ని కల్పిస్తోంది. తమ తల్లిదండ్రులు ఒంటరిగా కాకుండా, ఇతరులతో కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారనే భరోసాను దూరప్రాంతాల్లో ఉంటున్న వారి పిల్లలకు అందిస్తోంది.
వంటశాల నిర్వహణలో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. అవసరమైన సరుకులను సమీప పట్టణం నుంచి తెప్పిస్తున్నారు. విద్యుత్ అవసరాల కోసం సోలార్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
వృద్ధాప్యంలో ఉన్నవారికి కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు.. వారికి తోడు, ఆత్మీయత, గౌరవం కూడా అవసరమేనని చందంకి గ్రామ సామూహిక వంటశాల చాటిచెబుతోంది. వలసల కారణంగా వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ వినూత్న ప్రయత్నం ఇతర గ్రామాలకూ ఆదర్శంగా నిలుస్తోంది.







కామెంట్‌లు (0)