ప్రజాశక్తి - పీలేరు: తెలుగు భాషా సాహిత్యంపై అపారమైన పాండిత్యం.. ఏ అంశంపైనైనా గంటల తరబడి అనర్గళంగా ప్రసంగించే వాగ్ధాటి.. నిగర్వి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే తపస్వి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని రచయితలు, సాహితీవేత్తలకు సుపరిచితుడు .. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన విద్యావేత్త, రచయిత, వక్త డాక్టర్ చిన్నదాసరి నారాయణ స్వామి (71) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో విద్యా, సాహిత్య రంగాల్లో ఓ జ్ఞానదీపం ఆరిపోయినట్లయింది. ఆయన అందించిన సేవలు, పంచిన జ్ఞానం, సాహితీ సౌరభాలు చిరస్మరణీయంగా నిలిచిపోనున్నాయి. అన్నమయ్య జిల్లా, కె.వి.పల్లి మండలం, బసన్నగారి పల్లికి చెందిన నారాయణ స్వామి తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఈయన ఉత్తమ విద్యావంతుడిగా విశేష గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా, హాస్టల్ వార్డన్‌గా, గురుకుల విద్యాలయాల్లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకులయ్యారు. విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసానికి, సమాజ పురోగతికి పునాది అని భావించి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా భాకరాపేటలో గతంలో ఈయన నారాయణ స్కూల్‌ను స్థాపించి దిగ్విజయంగా నిర్వహించారు. ఆ పాఠశాల ద్వారా ఎందరో విద్యార్థులకు విద్యను అందించి వారి జీవితాల్లో ఆశల దీపాలు వెలిగించారు. పీలేరు పూర్వ విద్యార్థిగా ఈ ప్రాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగు భాషపై ఆయనకున్న అపారమైన పట్టు, సాహిత్యంపై మక్కువ ఆయనను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. ఎన్నో కవి సమ్మేళనాలను నిర్వహిస్తూ కవులను, సాహితీ ప్రియులను ఒక వేదికపైకి తీసుకొచ్చారు. తన ప్రసంగాల్లో వినూత్నమైన భాషా ప్రయోగాలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాల్లో పుక్షకులుగా పాల్గొని తన అసాధారణ జ్ఞాపకశక్తిని, పాండిత్య ప్రతిభను చాటుకున్నారు. ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించి, అద్భుతమైన పదజాలంతో సభికులను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సాహితీ లోకానికి తనదైన సేవలందించి, జ్ఞానాన్ని సమాజానికి పంచారు. పోలీసులకు స్ఫూర్తినిచ్చే సందేశాలను కూడా ఎన్నో ఇచ్చిన ఆయన ఇక లేరనే వార్త పలువురిని తీవ్ర విషాదానికి గురిచేసింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన బోధించిన విద్య, రచనలు, ప్రసంగాలు, సాహితీ సేవలు భావితరాలకు మార్గదర్శకంగా నిలవనున్నాయి. డాక్టర్ చిన్నదాసరి నారాయణ స్వామి అంత్యక్రియలు ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు కె.వి పల్లి మండలం లోని ఆయన స్వగ్రామమైన బసన్నగారి పల్లిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యావేత్తగా, సాహితీ మూర్తిగా ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ చిన్నదాసరి నారాయణ స్వామి కన్నుమూత
20 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 04:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)