చీరాల (బాపట్ల) : చీరాలలో ప్రముఖ వైద్యులుగా, హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ డేవిడ్సన్ సాలమన్ శుక్రవారం మరణించారు. హెచ్ఐవి తో జీవిస్తున్న ఎంతోమంది రోగులకు డాక్టర్ డేవిడ్సన్ సాలమన్ వైద్య సేవలు అందించడంతోపాటు, వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పిస్తూ మానసికంగా అండగా నిలిచారు. హెచ్ఐవి కారణంగా ఎదురయ్యే సామాజిక అపోహలు, వివక్ష, మానసిక సంక్షోభాలను అధిగమించేందుకు రోగులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ వారి జీవితాల్లో సానుకూల మార్పుకు కృషి చేశారు. వైద్య సేవలను కేవలం వృత్తిగా కాకుండా మానవతా దృక్పథంతో నిర్వహించిన డాక్టర్ డేవిడ్సన్ సాలమన్ ఎంతో మంది రోగులు, వారి కుటుంబాలకు ఆప్తుడిగా నిలిచారు. ముఖ్యంగా హెచ్ఐవి తో జీవిస్తున్నవారికి చికిత్సతో పాటు గౌరవంగా, ఆత్మగౌరవంతో జీవించాలనే నమ్మకాన్ని కల్పించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన మరణం చీరాల ప్రాంత వైద్య రంగానికి, హెచ్ఐవి బాధితుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థలకు, ఆయన సేవలు పొందిన అనేకమంది రోగులకు తీరని లోటు. ఆయన అందించిన వైద్య సేవలు, మానవతా విలువలు, రోగుల పట్ల చూపిన అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డాక్టర్ డేవిడ్సన్ సాలమన్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చీరాల ప్రముఖ వైద్యులు డాక్టర్ డేవిడ్సన్ సాల్మన్ మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 21, 2026, 01:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)