మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బైరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి విస్తృత ప్రచారం

8 నిమిషాల క్రితం

MLA Amarnath Reddy conducts extensive campaigning in Byreddipalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 03:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

భువన్ చంద్ర గౌడ్‌కు మద్దతుగా ఇంటింటా పర్యటన.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి

రూ.40 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టాం.. భవిష్యత్తులో పారిశ్రామిక, పర్యాటక కేంద్రంగా మండలం : ఎమ్మెల్యే

ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : సర్పంచ్ అభ్యర్థి భువన్ చంద్ర గౌడ్


ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండల కేంద్రమైన బైరెడ్డిపల్లిలో కూటమి ప్రభుత్వం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భువన్ చంద్ర గౌడ్‌కు మద్దతుగా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల్లో ఇంటింటా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని అభ్యర్థి భువన్ చంద్ర గౌడ్‌కు మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే స్వయంగా ఇళ్లకు వచ్చి ప్రచారం నిర్వహించడంతో పలువురు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ బైరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలంటే ప్రజలు కూటమి బలపరిచిన అభ్యర్థి భువన్ చంద్ర గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ .. బైరెడ్డిపల్లి మండలం భవిష్యత్తులో పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చెందేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఫుడ్ పార్క్ ఏర్పాటు, పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడపనత్తం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు వివిధ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు సుమారు రూ.40 కోట్లతో తారు, సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. గతంలో గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చేదని, రహదారుల నిర్మాణంతో ప్రయాణ ఇబ్బందులు తగ్గాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు.అనంతరం సర్పంచ్ అభ్యర్థి భువన్ చంద్ర గౌడ్ మాట్లాడుతూ బైరెడ్డిపల్లి గ్రామ ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే కుటుంబ సభ్యుడిలా భావించి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థిగా ఎంపికైన వెంటనే గ్రామంలోని చీకటిగా ఉన్న ప్రాంతాల్లో తన సొంత నిధులతో వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నానని, సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం అవసరమైతే సొంత నిధులతోనైనా సమస్యల పరిష్కారానికి ముందుంటానని స్పష్టం చేశారు.తన తండ్రి రమణ జర్నలిస్టుగా, ఆర్టీసీ కండక్టర్‌గా బైరెడ్డిపల్లి మండల ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. తమ కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తోందని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ మంచం గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని భువన్ చంద్ర గౌడ్ విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్