క్వారీ పనులకు తహసీల్దార్ బ్రేక్.. రహదారిపై అక్రమ పనులు నిలిపివేత
క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల పరిశీలన – హిటాచీలు, జేసీబీలను తరలించిన సిబ్బంది
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : క్వారీ పనులతో గ్రామీణ రహదారులు దెబ్బతింటున్న అంశంపై ప్రజాశక్తి ప్రచురించిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శుక్రవారం సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తహసీల్దార్ ప్రసన్నకుమార్ అక్రమంగా చేపడుతున్న పనులను తక్షణమే నిలిపివేయించారు. రహదారికి అడ్డంగా మట్టి, ఇతర పదార్థాలతో పనులు చేపడుతూ రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్న క్వారీ నిర్వాహకులకు అధికారులు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. తహసీల్దార్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో వీఆర్వో, సత్యానంద్, వీఆర్ఏ తదితర రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న పనులను గుర్తించి అక్కడ ఉన్న హిటాచీ, జేసీబీ యంత్రాలను తొలగించాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో యంత్రాలను అక్కడి నుంచి తరలించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్వారీ కార్యకలాపాల పేరుతో రహదారులను ఆక్రమించడం, రాకపోకలకు ఆటంకం కలిగించడం, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడం వంటి చర్యలను సహించేది లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనులు కొనసాగిస్తే సంబంధిత నిర్వాహకులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజాశక్తి కథనంతో కదిలిన యంత్రాంగం
క్వారీ పనులతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ప్రజాశక్తి ‘స్పందన’కు అధికార యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా అధికారులు స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి పనులను నిలిపివేయించడంపై గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించి క్వారీ పనులు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)