ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా): పెరవలి మండలం కానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి మోకాళ్ల లోతు నీటితో జలమయమైంది. ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు కేవలం గంట పాటు కురిసిన వర్షానికే కాలనీలోని రహదారులన్నీ చెరువులను తలపించాయి. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రామాలయం వరకు రోడ్లపై భారీగా నీరు చేరింది. కాలనీ సమీపంలో ఉన్న నంబర్-1 ప్రాథమిక పాఠశాల ప్రాంగణం కూడా పూర్తిగా నీట మునిగింది. దీంతో శనివారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు లోపలికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబేద్కర్ నగర్ నుండి మురుగు కాల్వలోకి వెళ్లే ప్రధాన డ్రైయిన్‌లో పూడిక (సిల్ట్) తీయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు మండిపడుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా ఈ ప్రధాన డ్రైయిన్ నిండిపోయి దళిత కాలనీ ముంపునకు గురవుతున్నా.. పంచాయతీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే డ్రైయిన్ పూడికను తొలగించి, కాలనీ మురుగు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు నిర్లక్ష్యంగానే ఉన్నారని స్థానిక నాయకులు, ప్రజలు మెలిమి శ్రీనివాస్, బురద నాగేష్, భావన గౌతమ్, మట్టే సత్తిపండు, మట్టే సుబ్బారావు తదితరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి వెంటనే పూడికను తొలగించి, తమ నివాసాలు ముంపునకు గురికాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దళిత కాలనీ ముంపు.. అధికారులకు పట్టదా?
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)