సిఎం చంద్రబాబుకు వి.శ్రీనివాసరావు లేఖ
ప్రజాశక్తి-అమరావతి : 1/70పై సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ కావాలని, ఈ చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని, జివో నెం 3కి ప్రత్యామ్నాయ జి.వో ప్రకటించాలని కోరుతూ.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. గిరిజన హక్కులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఇటీవల ప్రకటించిన సమీక్షా సమావేశం వ్యాఖ్యలు మాత్రమే సరిపోవని, 1/70 చట్టానికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జోక్యం చేసుకోకపోవడంతో గిరిజనుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు, హుకుంపేట, అనంతగిరి మండలాల్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు నవయుగ, అదానీ సంస్థలకు అనుమతులు ఇవ్వడం ద్వారా 1/70 చట్టం ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. అలాగే చింతపల్లి, జీకేవీధి మండలాల్లో బాక్సైట్ తదితర ఖనిజాల అన్వేషణ పేరుతో మట్టి నమూనాలు సేకరించేందుకు ప్రైవేటు కంపెనీలకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అనుమతులు ఇవ్వడం గిరిజనుల్లో ఆగ్రహానికి దారితీసిందన్నారు. ఎన్నికల సందర్భంగా జి.ఓ. నెం.3కు బదులుగా ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ రెండేళ్లు గడిచినా అమలు కాలేదని, దీనివల్ల యువతలో అసంతృప్తి పెరిగిందన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న భూములకు హక్కు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, వైద్య సేవలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవని పేర్కొన్నారు. ఇప్పటికీ గర్భిణులు డోలీల్లో ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో పాటు ప్రతి ఇంటికి లక్ష రూపాయల బకాయిలు ఉన్నాయని, నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో కేవలం 21 శాతం మందికే పరిహారం, పునరావాసం అందిందని, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. గిరిజన సంఘాల భాగస్వామ్యంతో 1/70 చట్టం, జి.ఓ. నెం.3పై చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఈ నెల 24న రంపచోడవరం పర్యటన సందర్భంగా 1/70 చట్టం, జి.ఓ. నెం.3, స్పెషల్ డీఎస్సీ, అటవీ హక్కుల పట్టాలు, పోలవరం నిర్వాసితుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని వి. శ్రీనివాసరావు తన లేఖలో కోరారు.








కామెంట్‌లు (0)