ఢిల్లీ : నీట్ పరీక్షల వివాదం, విద్యార్థులపై లాఠీచార్జి అంశాలు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను ఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలను కూడా నిర్బంధంలోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిర్వహించిన మార్చ్‌లో ఆందోళనకారులపై పోలీసుల చర్యకు నిరసనగా ప్రధాని మోడీ, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్‌షాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు ప్రయత్నించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నిరసన స్థలానికి చేరుకుని రాహుల్ గాంధీతో మాట్లాడారు. పార్లమెంటులో నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అయితే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడంతో చర్చలు విఫలమయ్యాయి. చర్చలు కొలిక్కి రాకపోవడంతో, పోలీసులు నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రణ్‌దీప్ సూర్జేవాలా, కె. సురేశ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.








కామెంట్‌లు (0)