విద్యార్థిని మృతి పట్ల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల తీవ్ర దిగ్భ్రాంతి.. నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రజాశక్తి – కోరుకొండ (తూర్పు గోదావరి) : కోరుకొండ జడ్పీ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని కొవ్వూరి కుసుమ అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందడంతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని మృతి నేపథ్యంలో శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరినీ సమావేశపరిచి కుసుమ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ... కుసుమ ఎంతో చురుకైన విద్యార్థిని అని, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఎంతో కలివిడిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. అటువంటి విద్యార్థిని అకస్మాత్తుగా అనారోగ్యంతో మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం క్లాస్ టీచర్లు, పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు కుసుమ నివాసానికి వెళ్లి ఆమె పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్న వయసులోనే కుసుమ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాఠశాలలో జరిగిన సంతాప సభలో స్కూల్ చైర్మన్ మాత ప్రభు, శివ సత్యనారాయణ, ఆర్.వి.అప్పారావు, బి.సతీష్, వరలక్ష్మి, సునీత, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కుసుమతో తమకున్న అనుబంధాన్ని, ఆమెతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.








కామెంట్లు (0)