శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కృత్రిమ విద్యుత్‌ సంక్ష‍ోభాన్ని సృష్టించిన యుడిఎఫ్‌ ప్రభుత్వం : పినరయి విజయన్

1 గంట క్రితం

Pinarayi Vijayan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 01:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తిరువనంతపురం : రాష్ట్రంలో యుడిఎఫ్‌ ప్రభుత్వం కృత్రిమంగా విద్యుత్‌ సంక్షోభాన్ని సృష్టిస్తోందని కేరళ ప్రతిపక్ష‍ నేత పినరయి విజయన్‌ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, జాతీయ స్థాయిలోనూ తీవ్ర విద్యుత్‌ సంక్షోభం లేదని శుక్రవారం పేర్కొన్నారు. విద్యుత్‌ లభ్యత మెరుగుపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేరళలో సంక్షోభం ఉందంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. దేశ విద్యుత్‌ ఉత్పత్తిలో అధిక భాగాన్ని నియంత్రిస్తున్న ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో నిజమైన విద్యుత్‌ కొరత ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని విజయన్‌ అన్నారు. కొరత ఉందని నమ్మించేలా పదేపదే సంక్షోభ ప్రకటనలు చేయడం కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రచారం వెనుక ఉన్న కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల విషయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు అనేక సందేహాలకు తావిస్తున్నాయని విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రతిపాదనకు బదులుగా జిఎన్‌ఎ ఎనర్జీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకోవడాన్ని ముఖ్యమంత్రి సమర్థించడంపై విజయన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. జిఎన్‌ఎ ఎనర్జీ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ కాదని, కేవలం డిజిటల్‌ ఒటిసి ప్లాట్‌ఫామ్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో టెండర్లు, పారదర్శక ప్రక్రియ పాటించలేదని పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి చేయని సంస్థ కోసం ముఖ్యమంత్రి ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. జిఎన్‌ఎ ద్వారా ఎవరి విద్యుత్‌ సరఫరా అవుతోందని, అసలు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఏదన్న విషయాలపై స్పష్టత లేదన్నారు.


కేరళ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (కెఎస్‌ఇబి) అంచనాల్లోని అక్రమాలను, భవిష్యత్తులో వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలను ఎత్తిచూపినందుకే అప్పటి విద్యుత్‌ శాఖ కార్యదర్శి, ఐఎఎస్‌ అధికారి ఆర్‌. రాజమాణిక్యాన్ని ఆ పదవి నుంచి తొలగించారని విజయన్‌ పేర్కొన్నారు. ఒత్తిడికి తలొగ్గేందుకు నిరాకరించినందుకే ఆయనను బదిలీ చేశారని అన్నారు. కెఎస్‌ఇబి అంచనాల్లో లోపాలుంటే వాటిని ప్రభుత్వం ప్రశ్నించాలని, అయితే అటువంటి లోపాలను నిరూపించలేదని పేర్కొన్నారు. విద్యుత్‌ బోర్డు సంభవించబోయే నష్టాలపై లేఖ రాసిందని, ఆ అంశాలు అధికారిక రికార్డుల్లో ఉన్నాయని తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌ విద్యుత్‌ ప్రతిపాదనకు అనుకూలంగా విద్యుత్‌ శాఖ మంత్రి సన్నీ జోసెఫ్‌ అధికారిక ఫైల్‌లో నమోదు చేసిన నోట్‌ ముఖ్యమంత్రి వాదనలకు విరుద్ధంగా ఉందని విజయన్‌ అన్నారు. జిఎన్‌ఎ ఒప్పందాన్ని సమర్థించుకునే క్రమంలో సవరించిన టారిఫ్‌ వివరాలను ముఖ్యమంత్రి గోప్యంగా ఉంచారని, దీనివల్ల రాష్ట్రానికి అదనంగా రూ.727 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని విమర్శించారు. అక్టోబర్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సవరించిన ఆఫర్‌ కింద విద్యుత్‌ను కొనుగోలు చేసినప్పటికీ, పీక్‌ అవర్స్‌ సరఫరాకు సంబంధించిన నిబంధనలను మార్చారని తెలిపారు. జిఎన్‌ఎ ఒప్పందంలో మాత్రం రోజంతా ఒకే రేటు వర్తించే విధంగా నిబంధనలు ఉన్నాయని, దీనివల్ల అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందన్నారు. ఈ వివరాలను దాచిపెట్టి పాత ఆఫర్‌ను ప్రముఖంగా చూపిస్తూ జిఎన్‌ఎ ఒప్పందాన్ని సమర్థించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. బార్‌ లైసెన్సుల వివాదంపై కూడా విజయన్‌ స్పందించారు. బార్‌ లైసెన్సులకు సంబంధించిన చట్టాన్ని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం తీసుకురాలేదని స్పష్టం చేశారు. 2011-2016 మధ్యకాలంలో ఎఫ్‌ఎల్‌-7 అనే కొత్త కేటగిరీని ప్రవేశపెడుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లాంజ్‌ బార్లకు అనుమతులు మంజూరు చేసేందుకు నిబంధనలు సవరించారని, ఎక్సైజ్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్లకు అనుమతులు ఇచ్చే అధికారం కల్పించారని వివరించారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయకుండా అప్పటికే అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించిందన్నారు. ప్రస్తుత వివాదానికి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చూపేందుకు ముఖ్యమంత్రి వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారని విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్