- ఉదయం 9 గంలకే జిల్లావ్యాప్తంగా 12.09 శాతం ఓటింగ్
- రాజమహేంద్రవరం డివిజన్‌లో 13.25 శాతం.. కొవ్వూరు డివిజన్‌లో 10.54 శాతం నమోదు
- రాజానగరం టాప్.. రాజమహేంద్రవరం రూరల్‌లో అత్యల్పం
ప్రజాశక్తి–రాజమహేంద్రవరం ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లాలో రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 12.09 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 12,02,248 మంది ఓటర్లకు గానూ 1,45,371 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 84,637 మంది పురుషులు, 60,733 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారు. ప్రారంభ రెండు గంటల్లోనే పురుష ఓటర్లు మహిళల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడం గమనార్హం.
రాజమహేంద్రవరం డివిజన్ ముందంజ
జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్లలో రాజమహేంద్రవరం డివిజన్ పోలింగ్‌లో ముందంజలో నిలిచింది. ఈ డివిజన్ పరిధిలో 6,88,624 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 91,214 మంది ఓటు వేశారు. దీంతో 13.25 శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో రాజానగరం మండలం అత్యధికంగా 16.39 శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అత్యల్పంగా 10.39 శాతం పోలింగ్ నమోదైంది.
కొవ్వూరు డివిజన్‌లో నెమ్మదిగా..
కొవ్వూరు డివిజన్‌లో పోలింగ్ ప్రారంభంలో కొంత నెమ్మదిగా సాగింది. ఈ డివిజన్ పరిధిలో 5,13,624 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 54,157 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10.54 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం తొమ్మిది మండలాల పరిధిలో ఉండ్రాజవరం మండలం అత్యధికంగా 13.54 శాతం పోలింగ్‌తో ముందంజలో ఉంది.
పురుష ఓటర్లే అధికం
జిల్లావ్యాప్తంగా నమోదైన పోలింగ్ గణాంకాలను పరిశీలిస్తే పురుష ఓటర్లు మహిళల కంటే అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 84,637 మంది ఓటు వేయగా, మహిళా ఓటర్లు 60,733 మంది మాత్రమే ఓటు వేశారు. ఇతరుల విభాగంలో ఒక ఓటు నమోదైంది. రెండు డివిజన్ల మధ్య పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రాజమహేంద్రవరం డివిజన్ కొవ్వూరు డివిజన్ కంటే 2.71 శాతం అధికంగా ఉంది.







కామెంట్‌లు (0)