బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ పాత్ర అత్యంత కీలకం: కమిషనర్ రాహుల్ మీనా

52 నిమిషాల క్రితం

పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ పాత్ర అత్యంత కీలకం
కమిషనర్ రాహుల్ మీనా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 05:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ

పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్‌ పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం ద్వారా స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్‌ రాహుల్‌ మీనా పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు, వ్యర్థాల నిర్వహణ, రీయూజ్‌, రీసైక్లింగ్‌, వ్యర్థాల తగ్గింపు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో సైన్స్‌, ఆర్ట్‌ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని దాదాపు 50 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రధాన అంశంగా విద్యార్థులు వివిధ సైన్స్‌ ప్రాజెక్టులు, నమూనాలు, డ్రాయింగ్స్‌, పోస్టర్లు, చార్టులు, సృజనాత్మక కళాఖండాలను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల్లో రైలు మార్గాల్లో వన్యప్రాణులు ప్రవేశించకుండా వైబ్రేషన్‌ ఆధారిత ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసే విధానం, డస్ట్‌ బిన్‌ నిండినప్పుడు మొబైల్‌ యాప్‌ ద్వారా సంబంధిత సిబ్బందికి ఎస్ఎంఎస్ అలర్ట్‌ అందించే స్మార్ట్‌ విధానం, వ్యర్థాలను వేరు చేసి నిర్వహించే విధానాలు, రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వ్యర్థాల నివారణ, స్వచ్ఛత, రీసైక్లింగ్‌, వ్యర్థాల తగ్గింపు వంటి అంశాలపై విద్యార్థులు రూపొందించిన డ్రాయింగ్స్‌, పోస్టర్లు, చార్టులు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలు పర్యావరణ సమస్యలపై వారికి ఉన్న అవగాహనతో పాటు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించాయి.


ఈ సందర్భంగా కమిషనర్‌ రాహుల్‌ మీనా మాట్లాడుతూ చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో వస్తువులను తిరిగి వినియోగించడం, రీసైక్లింగ్‌ చేయడం, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం వంటి అలవాట్లను పెంపొందించడం ద్వారా వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని అన్నారు. ఇలాంటి సైన్స్‌, ఆర్ట్‌ ప్రదర్శనల ద్వారా ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను విద్యార్థులు చిన్నతనం నుంచే అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. కాగితాన్ని రీసైక్లింగ్‌ చేయడం ద్వారా చెట్లను సంరక్షించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడవచ్చనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకుంటారని అన్నారు. పర్యావరణ సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక ఆలోచనలతో పరిష్కారాలను అన్వేషించేలా విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని కమిషనర్‌ అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ ఎ.వినూత్న, విద్యార్థులు, ఉపాధ్యాయులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్