గుంటూరు :
ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ దేశ వ్యాప్త పిలుపు మేరకు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు గుంటూరు కలెక్టరేట్ ఎదుట 29, 30వ తేదీల్లో చేపట్టిన 24 గంటల ధర్నా బుధవారం ముగిసింది. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానమంత్రి పంపించాలని కోరుతూ డిఆర్‌ఒకు అందజేశారు. ఈసందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ నిబంధనల సవరణ చట్టాలు, విధానాలు పెన్షనర్ల హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
రాబోయే రోజుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. తర్వాత దశగా డిసెంబర్ 12న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ, డిసెంబర్ 13న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఉమ్మడి జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జి.ప్రభుదాసు మాట్లాడుతూ... పెన్షన్ రూల్స్ (వాలిడేషన్ యాక్ట్-2025)ను ఉపసంహరించుకోవాలని, సుప్రీంకోర్టు చారిత్రక డి.ఎస్. నకారా తీర్పును యథాతథంగా అమలు చేస్తూ, ప్రతి వేతన సంఘంలోనూ తప్పనిసరిగా పెన్షన్ సవరణ చేపట్టాలని, 2026 జనవరి 1వ తేదీకి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ సవరణను పరిగణనలోకి తీసుకునేలా 8వ వేతన సంఘం నిబంధనలను సవరించాలని, 8వ వేతన సంఘం సిఫార్సుల సమర్పణ, అమలు ప్రక్రియలో జరిగే జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెన్షనర్లందరికీ తక్షణమే మధ్యంతర భృతిని మంజూరు చేయాలని కోరారు.
జిల్లా అధ్యక్షులు కె.కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మాధవరావు, కోశాధికారి శ్రీనివాసరావు, స్టేట్ అడిషనల్ సెక్రటరీ ప్రమీలరాణి, స్టేట్ అడిషనల్ సెక్రటరీ యన్.కుమార్ రాజా, పిచ్చయ్య, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)