మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు కృషి

02 అక్టోబర్, 2026

స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు కృషి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 05:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్

స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లో స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్ 2026 ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ సత్యం, అహింస, సత్యాగ్రహ మార్గాలతో ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి తెలిపారు. నెల్సన్ మండేలా వంటి ప్రపంచ నాయకులు గాంధీజీని ఆదర్శంగా తీసుకున్నారని గుర్తు చేశారు. స్వచ్ఛత మన చేతుల్లోనే ఉందని, మన ఇల్లు నుంచి ప్రారంభమై మన గ్రామం, మన పట్టణం, మన సమాజాన్ని మార్చాలన్నారు. మనసు, ఆలోచనలు, ప్రవర్తనతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు కృషి చేయాలని కోరారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన వేళ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పారిశుధ్య నిర్వహణలో సేవలందించిన పారిశుధ్య కార్మికులు నిజమైన ముందువరుస సేవకులని మంత్రి కొనియాడారు. వారి సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు. పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు వారికి తగిన శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అవార్డు ఒక బహుమతి మాత్రమే కాదు.. మరింత బాధ్యతతో పనిచేయాలనే ప్రేరణ అని మంత్రి అన్నారు. స్వచ్ఛాంధ్ర అవార్డులు అందుకున్న సంస్థలు, గ్రామాలు, అధికారులు, సిబ్బంది భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో పనిచేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గాంధీజీ స్వాతంత్ర్య సాధనతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి చూపిన నిజాయితీ, నిబద్ధతలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. మనలను ఎవరైనా గమనిస్తున్నప్పుడు ఎలా ఉంటామన్నది కాదు.. ఎవరూ గమనించనప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉంటామన్నదే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు. బొమ్మూరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థిని ధనశ్రీ తన పనిని తానే చేసుకోవడం, ఇతరులపై ఆధారపడకుండా బాధ్యతగా వ్యవహరించడంపై చెప్పిన మాటలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పరిశుభ్రత అనేది ఎవరో ఒకరు చేయాల్సిన పని కాదని, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ చెత్త సేకరణకు అవసరమైన సిబ్బంది, ఆర్థిక వనరుల విషయంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితే సంపూర్ణ పరిశుభ్రత సాధ్యమవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో అమలవుతున్న సమర్థవంతమైన పారిశుధ్య విధానాలను అమలు చేయాలని ఎంఎల్ఎలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు సూచించారు. గ్రామాల్లో సిబ్బంది కొరత, వనరుల పరిమితుల కారణంగా పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కేవలం ప్రసంగాలు, అవార్డులతో స్వచ్ఛత సాధ్యం కాదని, నిరంతర పారిశుధ్య నిర్వహణకు తగిన నిధులు, మానవ వనరులు అవసరమని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత, పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

​ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, డిపిఒ వి.శాంతామణి, ఆర్డీవో ఆర్.శివరాముడు, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అవార్డు గ్రహీతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్