శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డబ్బు కోసం కసాయిగా మారిన పొరుగువాడు.. !

1 గంట క్రితం

A neighbor turned into a ruthless brute for the sake of money
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 03:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పోణంగిలో వృద్ధురాలి దారుణ హత్య కేసు ఛేదింపు

సిమెంట్ ఇటుకతో తలపగులగొట్టి పాశవిక దాడి

నిందితుడిని అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు


ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించాల్సిన ఆ బామ్మ.. తన పొరుగునే ఉండే యువకుడి దురాశకు బలయ్యింది. ఆమె వద్ద ఉన్న కాసిన్ని డబ్బులపై కన్నేసిన ఆ యువకుడు, అర్ధరాత్రి దొంగతనానికి వెళ్లి, ఆ వృద్ధురాలు గుర్తుపట్టిందన్న భయంతో సిమెంట్ ఇటుకతో దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఏలూరు రూరల్ పరిధిలోని పోణంగిలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.


అసలేం జరిగిందంటే ...

ఏలూరు రూరల్ మండలం పోణంగి గ్రామం పాత మాలపల్లి జండా సెంటర్ సమీపంలో సిగిరెడ్డి మరియమ్మ అలియాస్ కుంటమ్మ (66) నివాసం ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన గూడపాటి అజయ్ (25) అనే యువకుడు, వృద్ధురాలి వద్ద డబ్బులు ఉన్నాయని పసిగట్టాడు. సులభంగా డబ్బులు కొట్టేయాలన్న దురాశతో అక్టోబర్ 21వ తేదీ అర్ధరాత్రి 11: 12:గంటల సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. చీకట్లో అలికిడికి నిద్రలేచిన మరియమ్మ, ఎదురుగా ఉన్న అజయ్‌ని గుర్తుపట్టి కేకలు వేసింది. తాను దొరికిపోతానన్న భయం, ఇతరులకు ఎక్కడ చెబుతుందో అన్న ఆందోళనతో అజయ్ కసాయిగా మారాడు. విచక్షణ కోల్పోయి అక్కడే ఉన్న ఓ సిమెంట్ ఇటుకను తీసుకుని ఆ వృద్ధురాలి తలపై విచక్షణారహితంగా పలుమార్లు బలంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన ఆ వృద్ధురాలిని గమనించిన స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఆమె కన్నుమూసింది. తెలిసిన యువకుడే ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా దర్యాప్తు ...

మొదట ఈ ఘటనపై ఏలూరు రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతి (సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యగా నిర్ధారించుకున్నారు. దీంతో కేసును సెక్షన్ 103(1), 62 R/W 305 (A) కిందకు మారుస్తూ లోతైన విచారణ ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన ఏలూరు 1-టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, రూరల్ ఎస్సై వి. వెంకటేశ్వరరావు, వారి సిబ్బందితో కలిసి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. పక్కా ఆధారాలతో నవంబర్ 12వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు నిందితుడు గూడపాటి అజయ్‌ను అరెస్ట్ చేశారు. వృద్ధురాలిని బలితీసుకున్న నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ రామకృష్ణ, ఎస్సై వెంకటేశ్వరరావులను ఉన్నతాధికారులు అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్