శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలి : రైతు సంఘం నాయకుల డిమాండ్

23 నిమిషాల క్రితం

Restore agricultural electricity connections Demand from farmers union leaders
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 03:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మార్టూరు (బాపట్ల) : మురసు తుఫాను ప్రభావంతో మార్టూరు మండలంలో నిలిచిపోయిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బత్తుల హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందిమళ్ళ రామ కోటేశ్వరావు ఆధ్వర్యంలో స్థానిక ఏఈ కార్యాలయంలో తుఫాను ప్రభావంతో ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన గుంటూరు జిల్లా ఎస్ఇ రమేష్ బాబు, మొవ్వ సురేంద్ర, ఏడిఈ పడవల ఘన నారాయణ, ఏఇ జీవి ఆంజనేయులు బృందానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల హనుమంతరావు మాట్లాడుతూ... మండలంలోని కోలలపూడి గ్రామంలోనే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న 800 మంది రైతులు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సాగునీటి అవసరాల కోసం బోర్లు, విద్యుత్ మోటార్లపై ఆధారపడుతున్న రైతులకు విద్యుత్ కనెక్షన్లు నిలిపివేయడం వల్ల పంటలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే సాగు, పెట్టుబడులు పెట్టిన రైతులు విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ నీరు సకాలంలో రాకపోవడంతో గ్రామాల్లోని రైతులు విద్యుత్ మోటార్ల పై ఆధారపడుతున్నారని మురసు తుఫానుతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో 1500 ఎకరాల్లో సాగు చేయాల్సిన మొక్కజొన్నకు సకాలంలో నీరు అందక మొదలు పెట్టలేదని చెప్పారు. బావుల కింద సాగు చేసిన వరి పూతదశలో ఉందని ఈ పరిస్థితుల్లో ఎక్కువ నీరు సకాలంలో అందిస్తేనే పంట చేతికి వస్తుందని తెలిపారు.వ్యవసాయాన్ని కాపాడటంతోపాటు రైతుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. ఎటువంటి జాప్యం లేకుండా నిలిచిపోయిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బాచిన సూరయ్య, తాటి వెంకటనారాయణ, గొట్టిపాటి బలరాం, పథకమూరి యోగయ్య, బోడెంపూడి సూరిబాబు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్