శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాలలో సైబర్ నేరాలు, యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన

45 నిమిషాల క్రితం

Awareness session on cybercrimes and anti ragging at CR Reddy Womens College
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు స్థానిక సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, యాంటీ ర్యాగింగ్, మహిళల భద్రత తదితర అంశాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు 3-టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావు పాల్గొని విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వారు హెచ్చరించారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని సూచించారు.


అప్రమత్తతే ఆయుధం : ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. ఫేక్ జాబ్ ఆఫర్లు, లోన్ యాప్‌ల వేధింపులు, ఆన్‌లైన్ డిస్కౌంట్ స్కామ్‌లు, ఏటీఎం కార్డ్ క్లోనింగ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేధింపులు, ఫోన్ నంబర్ల దుర్వినియోగం గురించి వివరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ చేయవద్దని, ఇంటర్నెట్‌ను కేవలం సమాచార సాధనంగా మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, 'పోక్సో' (POCSO) చట్టం, 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో తక్షణ పోలీసు సహాయం కోసం 'శక్తి యాప్' ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్