నవంబర్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ.. 26 న పోలింగ్
మండలంలోని 20 గ్రామాల్లో 51,665 మంది ఓటర్లు.. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు
ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం తొలి విడత ఎన్నికల పరిధిలోకి వచ్చింది. మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటర్ల సంఖ్య వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 గ్రామ పంచాయతీల పరిధిలో 51,665 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా లక్కవరం గ్రామంలో 7,070 మంది, ఆ తర్వాత తాడువాయి గ్రామంలో 5,535 మంది, వేగవరం గ్రామంలో 4,631 మంది ఓటర్లు ఉన్నారు.
గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు ....
1. నిమ్మలగూడెం – 802
2. అక్కంపేట – 1,045
3. టెక్కినవారిగూడెం – 1,317
4. గురవాయిగూడెం – 1,375
5. అమ్మపాలెం – 1,477
6. పట్టెనపాలెం – 1,507
7. తిరుమలాపురం – 1,575
8. పుట్లగట్లగూడెం – 1,575
9. చక్రదేవరపల్లి – 1,599
10. నాగులగూడెం – 1,682
11. దేవులపల్లి – 2,101
12. ఏ. పోలవరం – 2,232
13. పెరంపేట – 2,822
14. మైసన్నగూడెం – 2,908
15. పంగిడిగూడెం – 3,051
16. కేతవరం – 3,396
17. శ్రీనివాసపురం – 3,965
18. వేగవరం – 4,631
19. తాడువాయి – 5,535
20. లక్కవరం – 7,070
మొత్తం ఓటర్లు: 51,665 మంది.
నామినేషన్ల షెడ్యూల్ ....
నవంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
గ్రామాల్లో ఎన్నికల సందడి ....
మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులు, వార్డు సభ్యుల స్థానాల కోసం ఆశావహులు ఇప్పటికే రాజకీయ సమీకరణాలు ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు గ్రామాల్లో తమ మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. 51 వేలకు పైగా ఓటర్లు ఉన్న ఈ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారనున్నాయి.







కామెంట్‌లు (0)