72 కేజీల సరుకు పట్టివేత - నలుగురు అరెస్టు - ఇద్దరు పరారీ
ప్రజాశక్తి - మంగళగిరి : మండలంలోని కాజా టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయిని మంగళగిరి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుని అరెస్టు చేయగా ఇద్దరు పరారయ్యారు. ఈ మేరకు వివరాలను మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్‌పి కె.వెంకటేశ్వర్లు, సిఐ వెంకట్ ఆదివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి కాజ టోల్‌గేట్ వద్ద మంగళగిరి రూరల్ పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టింది. ఒడిశా నుంచి బెంగళూరుకు వెళ్తున్న రెండు కార్లను ఆపాలని పోలీసులు సూచించగా కారులోని వారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఈగల్ టీమ్ సిబ్బంది వెంబడించి చిన్నకాకాని హైలాండ్ వెనుక ప్రాంతంలో స్థానిక రైతుల సహకారంతో వాహనాలను అడ్డుకున్నారు. కార్లలోని వారిని అదుపులోకి తీసుకుంటుండగా వారు పోలీసులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు పరారవ్వగా మరో నలుగుర్ని, రెండు కార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్లలో తనిఖీలు చేసి 72 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో కేజీ గంజాయిని సుమారు రూ.7 వేల చొప్పున కొని ఇతర చోట్ల రూ.20-25 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గంజాయి రవాణా వెనుకున్న ఇతర వ్యక్తుల వివరాలపైనా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.







కామెంట్‌లు (0)