- విజయవాడ సిపి ఎస్.వి. రాజశేఖర బాబు
ప్రజాశక్తి-ఎన్టిఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు 'సేఫ్ విజయవాడ' లక్ష్య సాధనకు సాంకేతికత వినియోగం, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, మహిళల భద్రత, గంజాయి కట్టడి, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై 'ప్రజాశక్తి'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు తెలిపారు.
ప్రశ్న: 'సేఫ్ విజయవాడ' కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: విజయవాడను అత్యంత సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నాం. దాతల సహకారంతో ఇప్పటికే నగరంలో 12 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. 2027 నాటికి వాటి సంఖ్యను 20 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డీహెచ్ఎంఎస్ వ్యవస్థను వినియోగిస్తున్నాం. దీనివల్ల తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను 24 గంటల్లోపే ఛేదించగలుగుతున్నాం. కొత్తగా 222 మంది కానిస్టేబుళ్లు విధుల్లో చేరనున్నారు. డిసెంబర్ 2 తర్వాత నున్న, అజిత్‌సింగ్‌నగర్, టూటౌన్ ప్రాంతాల్లో పోలీసు గస్తీని మరింత పెంచుతాం.
ప్రశ్న: నేరస్తులను ఎలా పట్టుకుంటున్నారు?
జవాబు: విజయవాడ పోలీసు కమిషనరేట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నేరాల ఛేదన, సొత్తు రికవరీలో దాదాపు 80 శాతానికి పైగా ఫలితాలు సాధించడమే మా ఆత్మవిశ్వాసానికి ప్రధాన కారణం. నగరంలోని 12 వేల సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతున్నాం. నిందితులు మాస్కులు, టోపీలు ధరించి తప్పించుకునేందుకు ప్రయత్నించినా, వందలాది కెమెరాల ఫుటేజీని విశ్లేషించి సాంకేతిక ఆధారాలతో వారిని గుర్తించి పట్టుకుంటున్నాం. దొంగ సొత్తును కొనుగోలు చేసే బంగారు ఆభరణాల వ్యాపారులను కూడా అప్రమత్తం చేశాం. దొంగతనం చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్లినా పది రోజుల్లోపే పట్టుబడతాడు. అలాంటప్పుడు దొంగ సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారులే నష్టపోవాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేరస్తులు కూడా ఈ విషయాన్ని గుర్తించకుండా విజయవాడలో నేరాలకు పాల్పడి పట్టుబడుతున్నారు. అందుకే 'విజయవాడకు వచ్చి నేరం చేయవద్దు.. చేస్తే కచ్చితంగా పట్టుబడతారు' అని స్పష్టంగా హెచ్చరిస్తున్నాం.
ప్రశ్న: మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
జవాబు: మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. నగరంలోని ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. మహిళా పోలీస్‌స్టేషన్ బృందాలు నిరంతరం హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్థినులకు భరోసా కల్పిస్తున్నాయి. సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచుతున్నాం. ఆటోల్లో ప్రయాణించే మహిళల రక్షణ కోసం ఆటోల వెనుక 'సైబర్ సురక్ష' క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేశాం. ప్రయాణికులు వాటిని స్కాన్ చేసి డ్రైవర్ల ప్రవర్తనపై తమ అభిప్రాయాలను తక్షణమే తెలియజేయవచ్చు. త్వరలోనే 'బెస్ట్ ఆటో డ్రైవర్ ఆఫ్ ది మంత్' అవార్డును కూడా ప్రవేశపెట్టనున్నాం.
ప్రశ్న: లాడ్జిల్లో నేరాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి భార్యాభర్తలమనే ముసుగులో నగరానికి వచ్చి, లాడ్జిల్లో బస చేస్తూ హత్యలకు పాల్పడిన రెండు, మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని లాడ్జిలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. లాడ్జిలకు వచ్చి బస చేసే వారి వివరాలను కచ్చితంగా సేకరిస్తున్నాం. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఈ తరహా నిఘా ఫలితంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యల సంఖ్య తగ్గింది.
ప్రశ్న: గంజాయి రవాణా, విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి?
జవాబు: ఎన్టిఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రయాలను 99.9 శాతం అరికట్టగలిగాం. దేశంలోనే తొలిసారిగా డ్రగ్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టి గంజాయి నెట్‌వర్క్‌ను ఛేదించాం. 41 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశాం. గతంలో గంజాయికి బానిసలైన 1,305 మందిపై నిరంతర నిఘా ఉంచాం. వీరిలో 70 నుంచి 75 శాతం మంది మత్తు పదార్థాలకు దూరమై సాధారణ జీవితం గడుపుతున్నారు. గంజాయి కట్టడి ఫలితంగా నగరంలో దాడులు, ఇతర నేరాలు గణనీయంగా తగ్గాయి.
ప్రశ్న: సైబర్ నేరాలపై ప్రజలకు మీరిచ్చే సూచనలేమిటి?
జవాబు: సైబర్ నేరాల దర్యాప్తు కోసం 'సీ4' కేంద్రాన్ని ఏర్పాటు చేసి 100 మంది అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. క్రిప్టో కరెన్సీ మోసాలపైనా నిఘా ఉంచుతున్నాం. ఇళ్లలో కొత్తగా పనివారిని నియమించుకునే ముందు వారి పూర్వాపరాలను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి.
ప్రశ్న: సిబ్బంది కొరత, వీఐపీల రాకపోకల ఒత్తిడిని ఎలా అధిగమిస్తున్నారు?
జవాబు: పోలీస్ కమిషనరేట్‌లో మొత్తం 3,750 పోస్టులకు సుమారు 700 నుంచి 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు విజయవాడలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఒక వీఐపీకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలంటేనే కనీసం 350 మంది సిబ్బంది అవసరమవుతారు. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు బై లేన్ల వద్ద కానిస్టేబుళ్లకు బదులుగా ఆటోమేటిక్ బూమ్ బారియర్లను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాం.
ప్రశ్న: ట్రాఫిక్ నియంత్రణ, మైనర్ల డ్రైవింగ్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: ట్రాఫిక్ రద్దీని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు 'అస్త్రం' యాప్‌ను వినియోగిస్తున్నాం. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే సిబ్బందిని నియమిస్తున్నాం. మైనర్ల డ్రైవింగ్, వన్‌వే ఉల్లంఘనల నియంత్రణకు తల్లిదండ్రులు, విద్యాసంస్థల సహకారంతో ప్రత్యేక వీడియోలు రూపొందించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.







కామెంట్లు (0)