శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అసెంబ్లీ గేటు వద్ద విద్యుత్ కార్మికుల ఆందోళన

8 గంటల క్రితం

Protest by electricity workers at the Assembly gate
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 12:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పెండింగ్ వేతనాల కోసం..

అసెంబ్లీ గేటు వద్ద విద్యుత్ కార్మికుల ఆందోళన

-తక్షణమే వేతనాలు చెల్లించాలని సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ డిమాండ్


ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ లలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులు శనివారం ఆందోళన చేపట్టారు. నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ... అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. పెండింగ్ వేతనాల చెల్లింపుతో పాటు పని భారం తగ్గించాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం రవి,బి లక్ష్మణరావు మాట్లాడుతూ .... కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. సచివాలయం, అసెంబ్లీలోని వివిధ విద్యుత్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఎస్ అండ్ ఎస్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మే నెలతో ముగిసినప్పటికీ,సి ఆర్ డి ఎ అధికారులు తాత్కాలికంగా కొనసాగిస్తూ జూలై నెల నుంచి కార్మికులతో నిరంతరాయంగా పని చేయించుకుంటూ జూలై, ఆగస్టు, సెప్టెంబర్,అక్టోబర్ నెలలకు సంబంధించిన వేతనాలను నేటికీ చెల్లించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. పని చేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ కార్మికులకు జీతాలు చెల్లించడంలో ఎందుకు లేదని నిలదీశారు. నాలుగు నెలలుగా వేతనాలు లేకుండా కార్మికులు కుటుంబాలను ఎలా పోషించుకోవాలి.. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో జీతాలు చెల్లించకుండా కార్మికులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని రవి, లక్ష్మణరావు ప్రశ్నించారు.

మరోవైపు గత ఏడు సంవత్సరాలుగా వేతనాల పెంపు లేకపోవడం కార్మికుల జీవితాలను మరింత దుర్భరం చేస్తోందని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా, కార్మికుల వేతనాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా న్యాయమైన వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో 78 మంది కార్మికులు పనిచేస్తే ప్రస్తుతం కేవలం 38 మందితోనే పనులు చేయించడం వల్ల మిగిలిన కార్మికులపై విపరీతమైన పనిభారం పడుతోందని తెలిపారు. సిబ్బందిని సగానికి తగ్గించి,అదే స్థాయిలో పనులు చేయించాలని చూడటం కార్మికుల శ్రమను దోచుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తగ్గించిన సిబ్బందిని తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అవసరమైన మేరకు కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా నిర్ణీత గడువు లోగా వేతనాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకనైనా సి ఆర్ డి ఎ అధికారులు కళ్లు తెరిచి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లింపుతో పాటు మిగిలిన సమస్యలను పరిష్కరించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులను సమీకరించి ప్రత్యక్ష ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆందోళనల వల్ల ఏర్పడే పరిస్థితులకు పూర్తి బాధ్యత సి ఆర్ డి ఎ అధికారులదేనని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్