ప్రజాశక్తి, మంగళగిరి : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీసీఎల్‌ఏ జయలక్ష్మికి ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ, సిఐటియు ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఏల చేత భర్తీ చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, అక్రమ డ్యూటీలను తొలగించాలని వినతిపత్రంలో కోరారు.
దీనిపై సి సి ఎల్ ఏ స్పందిస్తూ, వీఆర్వో పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కృషి చేస్తానని, వీఆర్వో ప్రమోషన్ కోటా కాకుండా పూర్తి స్థాయిలో ప్రమోషన్లను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయుటకు ఫైలు పెడతామని తెలియజేశారు. అలాగే అదనపు డ్యూటీల వల్ల వీఆర్ఏలు పడుతున్న ఇబ్బందులను గుర్తించామని, అందుకు సంబంధించి తహసీల్దార్లకు త్వరలోనే ఆదేశాలు ఇస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి. త్రినాథ రావు, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆవుల రాజ్ కుమార్, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యస్వామి, విజయనగరం జిల్లా అధ్యక్షులు కె. గురుమూర్తి, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రమణమూర్తి, పల్నాడు జిల్లా నాయకులు అబ్దుల్ మునాఫ్, నెల్లూరు జిల్లా నాయకులు అంకారావు, అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు నీలకంఠం తదితర నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)