ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 28 రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా 28 జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జిఒ115ను శనివారం జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న 13 జిల్లా ప్రజా పరిషత్తుల స్థానంలో నూతనంగా 28 జెడ్‌పిలు ఏర్పాటు కానున్నాయి. 2022 ఏప్రిల్ 4న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించగా, 2025 నవంబర్ 27న మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పడటంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. అయితే జెడ్‌పిలను పాత 13 జిల్లాల ప్రాతిపదికనే కొనసాగుతున్నాయి. వీటి పాలకవర్గాల పదవీకాలం 2021 సెప్టెంబర్ 25న ప్రారంభమై, 2026 సెప్టెంబర్ 24తో ముగియనుంది. పంచాయతీరాజ్ చట్టం 1994, సెక్షన్ 177 ప్రకారం ప్రతి జిల్లాకు ఒక జెడ్‌పి ఉండాలని, సెక్షన్ 274-ఎ(2) ప్రకారం ప్రస్తుత సంస్థల గడువు తర్వాతే పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని జిఒలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 13 పాత జెడ్‌పిలను రద్దు చేసి 28 నూతన జెడ్‌పిలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాల పరిధిలోని మండల పరిషత్తులను నూతన జెడ్‌పిల పరిధిలోకి తీసుకువస్తారు.నూతన జెడ్‌పిల నిర్వహణ కు15 అదనపు సిఇఒ పోస్టులు, 15 అదనపు డిప్యూటీ సిఇఒ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. రాజకీయ నిరుద్యోగులకు ఉన్న వారికి పెరిగిన జెడ్‌పిలతో అదనంగా పదవులు వచ్చే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)