ప్రజాశక్తి - పెదనందిపాడు
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్ని ముందుకు తీసుకుపోవడమే నారాయణ గారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని మాజీ శాసన మండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు అన్నారు. గురువారం పెదనందిపాడు తేళ్ళ నారాయణ విజ్ఞాన కేంద్రం లో జరిగిన, తేళ్ల నారాయణ గారి 4 వ వర్ధంతి సభ లో లక్ష్మణరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సభకు విజ్ఞాన కేంద్రం కన్వీనర్ దొప్పలపూడి రమేష్ బాబు అధ్యక్షత వహించారు.లక్ష్మణరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ,రైతాంగ సమస్యల పరిష్కారానికి నారాయణ అనేక ఉద్యమాలు నిర్మించారన్నారు. కమ్యూనిస్టు విలువలతో జీవితాన్ని కొనసాగించారని అన్నారు.ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల కోసం ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సి వస్తుందని అన్నారు.ప్రస్తుత ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తున్నారని, గతంలో పని చేసిన ఎన్నికల కమిషనర్ శేషన్ అద్బుతంగా, స్వతంత్రంగా పని చేశారని అన్నారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ సర్ పేరుతో అక్రమంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని, ఇది రాజ్యాంగ విరుద్దమని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కుని కాలరాయడమేనని అన్నారు. ఒక ఓటు, ఓక మనిషి, ఒక విలువ అని అంబేద్కర్ చెప్పారని అన్నారు. ఓటు ఉన్నందునే రాజకీయ నాయకులు, అయిదు సంవత్సరాలకు ఒకసారైనా పేదలను పలుకరిస్తున్నారని, ఓటు లేకపోతే వారి మొహం కూడా చూసే పరిస్థితి ఉండదని అన్నారు.నిరసనల కేంద్రంగా ఉన్న జంతర్ మంతర్ ని తొలగించి, ఢిల్లీకి 21 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలలో నిరసనలకు అవకాశం కల్పించారంటే, ఎందుకు ప్రభుత్వం భయపడుతుందో అర్ధం కావడం లేదని అన్నారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, సర్ ని రద్దు చేయాలని ఢిల్లీ లో ఉధ్యమాలు జరుగుతుంటే,అందుకు కారణమైన ఎన్నికల కమిషనర్ చేత రాజీనామా చేయించకుండా, ఉధ్యమ కారులమీద కేసులు పెట్టి తీహార్ జైలుకు పంపించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. వీటన్నిటి పరిష్కారం కొరకు పోరాటాలను ముందుకు తీసుకుపోవడమే నారాయణ గారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.మంచి పుస్తకం నిర్వాహకులు, నారాయణ గారి అల్లుడు కాపు శ్రీనివాస్ ముందుగా నారాయణ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, నారాయణ గారు నిబద్దతగల వ్యక్తి అని, నమ్మిన సిద్దాంతం కోసం కడవరకు కట్టుబడి పని చేశారని అన్నారు. పట్టుదలగా పని చేసే వారని అన్నారు. నేడు దేశంలో యువకులు నీట్ పరీక్ష లో జరిగిన అవకతవకల మీద,ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని వీదుల్లోనికి వచ్చి పోరాటం చేస్తున్నారని అన్నారు.
గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాశం రామారావు మాట్లాడుతూ, నారాయణ గారు పాలపర్రులో పార్టీ నిర్మాణంలో ఎంతో కృషి చేశారని, పాత తరం కమ్యునిస్టుగా , అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని అన్నారు.వారి గుర్తుగా, వారి కుటుంబ సభ్యుల సహకారంతో పెదనందిపాడు లో విజ్ఞాన కేంద్రం నిర్మించడం జరిగిందని, ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా రాబోయే కాలంలో కంప్యూటర్ శిక్షణ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పి. ఎ. ఎస్. కళాశాల ప్రిన్సిపాల్ గుర్రం వీరరాఘవయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి శేషగిరిరావు, లావు వెంకట నాగేశ్వరరావు, కందుల శ్రీనివాసరావు లు నారాయణ గారికి నివాళులర్పించి మాట్లాడారు.
ఈ సందర్భంగా, పెదనందిపాడు మాజీ ఎం .పి. పి. నర్రా బాలకృష్ణ మరియు గుంటూరు రోటరీ క్లబ్ ఆదర్శ్ వారి సహకారంతో ఆరుగురికి కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణ గారి కుమారులు తేళ్ల రాము, తేళ్ల నాగరాజు,నాయకులు ముద్దన వెంకటేశ్వర్లు, కన్నెగంటి చందర్రావు, గారపాటి రమేష్, కొర్రపాటి లక్ష్మి, ఫణిదపు భువనేశ్వరి, ఇనగంటి మొగలయ్య,గోలి సుబ్బారావు,రిటైర్డ్ టెలికం నాయకులు కె.రామమోహనరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)