గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్

1 గంట క్రితం

స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు 
సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలి
టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 06:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల సన్నాహకాలు, నామినేషన్ల ప్రక్రియ, ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, భద్రతా చర్యలు, సిబ్బంది నియామకాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహశీల్దార్లు, ఎంపీడీవోలు ఎన్నికల ఏర్పాట్లను సమన్వయంతో పర్యవేక్షించాలని, రంపచోడవరం, చింతూరు సబ్ కలెక్టర్లు తమ డివిజన్ల పరిధిలోని ఏర్పాట్లపై వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఓటర్ల జాబితాల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల సామగ్రి సమీకరణ, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.


సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రస్తుత పరిస్థితులపై తాజా వివరాలతో కూడిన సమగ్ర నివేదికలు సమర్పించాలని తహశీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. గత ఎన్నికల అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులు, స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకొని పోలింగ్ కేంద్రాల వారీగా తాజా సమాచారాన్ని సేకరించాలని, ఆ వివరాల ఆధారంగా అవసరమైన పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది, ఇతర మానవ వనరుల నియామకం చేపట్టాలని సూచించారు.


ఎన్నికలకు సంబంధించి ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించేందుకు జిల్లా స్థాయిలోనూ, రంపచోడవరం, చింతూరు డివిజన్లు, ప్రతి మండల పరిధిలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, వాటికి సంబంధించిన సంప్రదింపు నంబర్లను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జిల్లా స్థాయి కలెక్టరేట్‌లో 1800 -425-4225 కంట్రోల్ రూమ్ నెంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న రాజకీయ నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రిని నిబంధనల ప్రకారం తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, సరిహద్దుల మార్పులు, పంచాయతీల విభజనకు సంబంధించి కొన్ని గ్రామాల్లో వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై అధికారులు ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో అమల్లో ఉన్న పంచాయతీ పరిధి, ఓటర్ల జాబితా ప్రకారమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి జి.గణేష్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్