19 పునరావాస కేంద్రాల ఏర్పాటు
రంగంలోకి మంత్రి మల్లాడి, ఆర్ఎఒ
ప్రజాశక్తి – యానాం : 'అర్నాబ్' తుపాను ప్రభావంతో యానాం ప్రాంతంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. రహదారులపై పడిన చెట్లను మున్సిపల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పట్టణంలో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
19 పునరావాస కేంద్రాల ఏర్పాటు
తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని యానాం యంత్రాంగం రంగంలోకి దిగింది. అధికారులు పట్టణ వ్యాప్తంగా 19 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మంత్రి మల్లాడి కృష్ణారావు, ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనా కలిసి పలు పునరావాస కేంద్రాలను సందర్శించి, అక్కడ బాధితులకు చేసిన వసతులను, భోజన ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రి మల్లాడి కృష్ణారావు, ఆర్ఏఓ శివరాజ్ మీనా, వివిధ శాఖల అధికారుల బృందం తుపాను ప్రభావిత ప్రాంతాలైన సావిత్రి నగర్, గిరియంపేట, దరియాలతిప్ప, ఫరంపేట, కూరసంపేట, మెట్టకూరు, కనకాలపేట, ఫెర్రీ రోడ్డు తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను సమీక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.
అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల
తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. ఈదురు గాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం 8885613111, 9391149707, 9032093583 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. యానాంలో భారీ నష్టాన్ని మిగిల్చిన 1996 నాటి ఘోర తుపాను అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)