రాక్షస అలలతో బెంబేలు.. పునరావాస కేంద్రాలకు తరలించలేదని మత్స్యకారుల ఆవేదన
ప్రజాశక్తి - యు.కొత్తపల్లి (కాకినాడ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాను ప్రభావంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో రాక్షస అలలు ఎగసిపడుతుండటంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యు.కొత్తపల్లి మండలంలోని సూరాడిపేట , పల్లిపేట తదితర తీర గ్రామాల మత్స్యకారులు సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.తుఫాను తీవ్రత పెరిగితే తమ పరిస్థితి ఏమిటోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ముప్పు పొంచి ఉన్నప్పటికీ అధికారులు తమను పునరావాస కేంద్రాలకు తరలించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో ప్రస్తుతం అలలు ఉధృతంగా ఎగసిపడుతుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందేమోనని భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ బుధవారం నాటికి సముద్రం మరింత ఉగ్రరూపం దాలిస్తే తమ పరిస్థితి ఏమిటని తీర గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.అధికారులు తక్షణమే స్పందించి తీర గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించాలని, ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.







కామెంట్‌లు (0)