చట్ట ప్రకారం కారణాలు వెల్లడించాలి
కలెక్టర్‌పై నమ్మకం ఉంది
యు. కొత్తపల్లి జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై వడిశెట్టి నారాయణరెడ్డి అభ్యంతరం
ప్రజాశక్తి- కాకినాడ : నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయి, సక్రమంగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించిన అనంతరం తమ నామినేషన్ తిరస్కరించబడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు వడిశెట్టి నారాయణరెడ్డి ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయకుండా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం చట్టబద్ధమైన ప్రక్రియ కాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసేందుకు వచ్చిన ఆయన ఆదివారం కాకినాడ కలక్టరేట్ లోని మీడియాతో మాట్లాడారు.
నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం నియోజకవర్గంలోని యు. కొత్తపల్లి మండలంలో వైఎస్సార్సీపీ తరఫున తన భార్య వడిశెట్టి గౌరీ రాజేశ్వరిని జెడ్పీటీసీ అభ్యర్థిగా ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగిన నామినేషన్ పరిశీలనలో రిటర్నింగ్ అధికారి అయిన జాయింట్ కలెక్టర్ పత్రాలను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉన్నాయని, పరిశీలనలో అర్హత సాధించినట్లు తెలిపి పత్రం కూడా అందజేశారని పేర్కొన్నారు.అయితే అదే రోజు సాయంత్రం 7.30 గంటలకు ఫోన్ చేసి తమ నామినేషన్ తిరస్కరించబడిందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చి అప్పీల్ చేసుకోవాలని చెప్పినట్లు వెల్లడించారు. నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారో, ఏ చట్టం లేదా నిబంధన ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నారో అధికారులు వివరించలేదని ఆయన ఆరోపించారు.
నిబంధనల ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలి ....
నామినేషన్ పత్రాల్లో ఏవైనా లోపాలుంటే వాటిని అభ్యర్థికి తెలియజేసి, వివరణ తీసుకున్న అనంతరం తిరస్కరణకు గల కారణాలను లిఖితపూర్వకంగా ఉత్తర్వుల్లో పేర్కొనాలని నారాయణరెడ్డి అన్నారు. ఆ ఉత్తర్వుల ప్రతిని అభ్యర్థికి అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ నిబంధనలు–2006లోని రూల్ 12(3) ప్రకారం నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే తమ విషయంలో ఆ ప్రక్రియను పాటించలేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. కలెక్టర్‌కు అప్పీల్ సమర్పించి న్యాయం కోరనున్నట్లు వెల్లడించారు. అప్పీల్‌పై తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి విషయాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.
అభివృద్ధిపై నమ్మకముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌లను ఉద్దేశించి నారాయణరెడ్డి వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని చెబుతున్న నాయకులు తమ అభివృద్ధిపై నమ్మకముంటే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి ప్రజల తీర్పు కోరాలని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే హక్కు అన్ని పార్టీలకూ ఉందని, ప్రజల ఆశీర్వాదం పొందిన వారే ఎన్నికల్లో గెలుస్తారని పేర్కొన్నారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత విశ్వనాథ్ ఆశీస్సులతో ప్రజలకు సేవ చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంటూ పనిచేశామని, తమకు ప్రజల మద్దతు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాజకీయంగా ఎదుర్కోవాల్సిన ప్రత్యర్థుల నామినేషన్ల విషయంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సరికాదని, కుట్రలకు తావులేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తమ నామినేషన్ తిరస్కరణపై కలెక్టర్‌కు అప్పీల్ చేయనున్న నేపథ్యంలో, దానిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూస్తామని వడిశెట్టి నారాయణరెడ్డి తెలిపారు.








కామెంట్లు (0)