పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
ప్రజాశక్తి-పిఠాపురం
పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పిఠాపురం సర్కిల్ పరిధిలో పోలీసులు మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పి జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు, కాకినాడ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎన్.ఎస్.వి.కె. దుర్గారావు పర్యవేక్షణలో పిఠాపురం మండలంలోని చిత్రాడ, పాత కందరాడ, ఎఫ్.కె. పాలెం, గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డిపిఒ దుర్గారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలు ఎటువంటి భయాందోళనలు, ఒత్తిళ్లు, బెదిరింపులకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపడుతోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు తలెత్తకుండా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు, గ్రామ పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో పిఠాపురం సిఐ జి.వి.వి సత్యనారాయణ, పట్టణ ఎస్ఐ వి.మణికుమార్, గొల్లప్రోలు ఎస్ఐ ఎన్.రామకృష్ణ, పిఠాపురం రూరల్ ఎస్ఐ ఎస్.కె జాన్ భాషా, యు.కొత్తపల్లి ఎస్ఐ జి. వెంకటేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)