సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన

1 గంట క్రితం

Foundation stone laid for the installation of 117 new flood gates at the Sir Arthur Cotton Barrage.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 05:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.152.95 కోట్ల వ్యయంతో 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో సభాధ్యక్షులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ప్రారంభోపన్యాసకులు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ప్రసంగించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ .... ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్న ధవళేశ్వరం బ్యారేజీకి నూతన వరద గేట్ల ఏర్పాటు గోదావరి డెల్టా చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే సుమారు 10.13 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు. రూ.152.95 కోట్లతో 117 గేట్ల మార్పిడికి శ్రీకారం చుట్టడం డెల్టా రైతాంగానికి శాశ్వత భరోసానిస్తుందని పేర్కొంటూ ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి డెల్టా రైతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 117 వరద గేట్ల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రైతుల కోసం 'అన్నదాత సుఖీభవ', పేదల కోసం ఎన్టీఆర్ భరోసా, మహిళల కోసం దీపం–2.0, స్త్రీశక్తి వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.పిచ్చుకలంకలోని 62 ఎకరాల భూమిని సమగ్ర పర్యాటక అభివృద్ధికి వినియోగించుకునేలా జీవోలో అవసరమైన సవరణలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గోదావరి డెల్టా అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వరద గేట్ల ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రాధాన్యంగా చేపట్టిందని, గతంలో పూర్తికాని పనులను ఇప్పుడు వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. కొబ్బరి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అమలాపురం ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి సహకారంతో త్వరలోనే సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్