న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర విరాళాల స్కామ్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని సిపిఐ(ఎం) ఎంపి జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. రాముడిని కూడా దోచుకున్నారని అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వ్యాఖ్యలపై ఆయన సోమవారం స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను కేంద్రప్రభుత్వం నియంత్రిస్తోందని, కానీ రామమందిర ట్రస్ట్‌ను ఎవరు నియంత్రిస్తున్నారో తెలియదని.. ఇది అత్యంత ఆందోళన చెందాల్సిన అంశమని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నిజాయితీగా ఉన్నట్లయితే..కోట్లాది మంది రామభక్తులను మోసానికి గురైన నిధుల గందరగోళంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాల్సిందిగా డిమాండ్ చేయాలని సూచించారు. విరాళాలు, రామమందిర నిర్మాణ ప్రక్రియలో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, సమగ్ర విచారణకు పిలుపునివ్వాలని కోరారు. ఈ వ్యవహారాలో అనేక దశల్లో భారీగా నిధుల దోపిడీ జరిగిందని, విరాళాల విభాగం బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిని ఆ బాధ్యతల నుండి తప్పించే సమయంలోనే ఆయనపై ప్రశంసలు కురిపించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. రామమందిర నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు కూడా అక్కడ 40శాతం కమిషన్ వ్యవహారం నడిచిందని అన్నారు. అంటే నృపేంద్ర మిశ్రా వెల్లడించింది భవన నిర్మాణానికి అయిన వాస్తవ ఖర్చు కాదని అన్నారు. ప్రతి అంశాన్ని విడివిడిగా కప్పి ఉంచడానికి బదులుగాఈ దోపిడీకి సంబంధించిన అన్ని అంశాలపై లోతైన, సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని, శ్రీరాముడినే దోచుకున్నారని అన్నారు.
విరాళాల సేకరణలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన చర్యలు ఒక "నిర్ణయాత్మక మలుపు"కు చేరనున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోందని అంబేకర్ పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)