ప్రజాశక్తి-కంకిపాడు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పెనమలూరు మండలం కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేసే ఏర్పాట్లు, పోలింగ్ అనంతరం సిబ్బంది నుంచి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు స్వీకరించే రిసెప్షన్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలతో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఇదే కళాశాలలో నిర్వహించనున్న నేపథ్యంలో, ఎన్నికల విధులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, కౌంటింగ్ నోడల్ అధికారి మార్క్ ఫెడ్ డిఎం మురళీ కిషోర్, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు.







కామెంట్లు (0)