- టిడిపి నుండి మరీదు కరుణ, వైసిపి నుండి మెరుగుమాల ప్రవీణ
- చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలు
- ర్యాలీలతో హోరెత్తిన పట్టణం
గుడివాడ పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజైన సోమవారం అత్యంత కోలాహలంగా ముగిసింది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున ర్యాలీలుగా తరలివచ్చి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం, మున్సిపల్ కార్యాలయ పరిసరాలు సందడిగా మారాయి.
చైర్మన్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో టిడిపి చైర్‌పర్సన్ అభ్యర్థిగా మరీదు కరుణ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాములతో కలిసి ఆమె ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యంనకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మరోవైపు వైసిపి చైర్‌పర్సన్ అభ్యర్థిగా మెరుగుమాల కాళీ సతీమణి మెరుగుమాల ప్రవీణ నామినేషన్ వేశారు. ఆమెకు మద్దతుగా మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి విచ్చేశారు. ఇరు పార్టీల శ్రేణుల నినాదాలతో ఆర్డీవో కార్యాలయ ప్రాంతం మార్మోగింది.








కామెంట్‌లు (0)