ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు ఇక డిజిటల్‌లోనే --- జిల్లా కలెక్టర్

6 రోజుల క్రితం

ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు ఇక డిజిటల్‌లోనే --- జిల్లా కలెక్టర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 07:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కలక్టరేట్ ( కృష్ణా)

​ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్య వివరాలు, వైద్య పరీక్షల నివేదికలు, చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక డిజిటల్ హెల్త్ ఐడీ రూపొందించి, వారి ఆరోగ్య చరిత్ర మొత్తాన్ని అందులో నిక్షిప్తం చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధులను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఇతర వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సాధారణ పరీక్షల కోసం వచ్చినా, అనారోగ్యంతో వైద్యం పొందినా సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత వైద్య పరీక్షల నివేదికలు, ప్రయోగశాల పరీక్షల ఫలితాలు, చికిత్స వివరాలను డిజిటల్ హెల్త్ ఐడీకి అనుసంధానం చేయాలన్నారు. తద్వారా ఉన్నత ఆసుపత్రులకు తరలించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆసుపత్రికి వెళ్లినా రోగి అనుమతితో గత వైద్య చరిత్రను పరిశీలించి తగిన చికిత్స అందించేందుకు వీలవుతుందని వివరించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా వైద్యులు సూచించిన మందులను నిర్ణీత సమయానికి, పూర్తిస్థాయిలో వినియోగించేలా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫోన్ కాల్స్ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. కుటుంబ చరిత్ర ఆధారంగా కొన్ని రకాల క్యాన్సర్లు, జన్యుపరమైన వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు డిజిటల్ హెల్త్ రికార్డులు ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దయాకర్, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి శేషుకుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్