ప్రజాశక్తి-గిద్దలూరు (మార్కాపురం జిల్లా)
పక్కా పథకం ప్రకారమే సిపిఎం నాయకుడు ఆవులయ్యపై దాడి చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా కొమరోలులో ఎంపిటిసి నామినేషన్ల సమయంలో జరిగిన ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. గిద్దలూరు మండలం పొదిలికొండపల్లిలో సిపిఎం నాయకులు ఆవులయ్య స్వగృహంలో ఆయనను శ్రీనివాసరావు పరామర్శించి అనంతరం మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఉదయం నుంచీ సిద్ధంగా ఉన్నప్పటికీ, పోలీసులు సాయంత్రం రమ్మని చెప్పారని, తీరా సాయంత్రం వేళకు బయటి నుంచి రప్పించిన టిడిపి మద్దతుదారులు, గుండాలు వందల సంఖ్యలో ఏకమై పథకం ప్రకారం దాడికి తెగబడ్డారని విమర్శించారు. తమ పార్టీ నాయకులపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయనివ్వకుండా దౌర్జన్యాలు చేసి, ఏకగ్రీవాలు సాధించాలనే దుష్ట సంకల్పంతోనే ఇటువంటి ఘాతుకాలకు టిడిపి నాయకులు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇది నిజమైన ప్రజాస్వామ్య విధానం కాదని, ఏకపక్షంగా గెలవడం అనేది విజయంకాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆవులయ్యకు, ఆయన కుటుంబానికి సిపిఎం పూర్తి అండగా ఉంటుందన్నారు.







కామెంట్‌లు (0)