శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ రూరల్‌ కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ లక్ష్మీశ

10 గంటల క్రితం

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 10:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సజావుగా సాగుతున్న ఓట్ల లెక్కింపు..

  • మధ్యాహ్నం 1, 2 గంటల సమయానికి తొలి రౌండ్‌ ఫలితాలు

ప్రజాశక్తి-ఎన్టీఆర్‌ జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా కొనసాగుతోంది. విజయవాడ రూరల్‌ పరిధిలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ శనివారం ఉదయం సందర్శించి, లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని తెలిపారు. తొలుత చేపట్టిన బ్యాలెట్‌ పేపర్ల వర్గీకరణ (సెగ్రిగేషన్‌) ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని పేర్కొన్నారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలను పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది, వివిధ పార్టీల ఏజెంట్లు ఉదయం 7 గంటలకే తమకు కేటాయించిన స్థానాలకు చేరుకున్నారని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెక్కింపు సజావుగా సాగుతోందని అన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత, పోలీసు బందోబస్తును రిటర్నింగ్‌ అధికారులు, సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

మధ్యాహ్నానికి తొలి రౌండ్‌ ఫలితాలు

ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోందని, మధ్యాహ్నం 1 లేదా 2 గంటల సమయానికి తొలి రౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు ఏవైనా సందేహాలు ఉంటే అక్కడికక్కడే నివృత్తి చేసుకోవాలని, ప్రక్రియను నిదానంగా, జాగ్రత్తగా కొనసాగించాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసినట్లు గుర్తుచేశారు. లెక్కింపులో తొందరపాటు వద్దని, పూర్తి పారదర్శకతతో తప్పులు జరగకుండా ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్