నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులను పెంచుతూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న కూటమి ఎన్డీఏ సర్కార్
ప్రజలను కొల్లగొడుతూ... మరోవైపు టిడిపి కార్యకర్తల ఆదాయాలను సంవత్సరానికి 75 లక్షలకు పెంచుతామని ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటు
రాష్ట్రంలోని ప్రజలకు సంపద సృష్టిస్తామని చెప్పి... నేడు కార్యకర్తలకు దోచిపెడతామని చెప్పటం శోచనీయం
నేతల అవినీతిలో కార్యకర్తలకు వాటాలిచ్చి అవినీతిని వ్యవస్థీకృతం చేస్తారా ?
నేతలు, కార్యకర్తలు ఆదాయాలకు కాదు... ప్రజల ఆదాయాల పెంచండి, ధరలు తగ్గించండి
61వ డివిజన్ శాంతినగర్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు సిపిఎం నేతల పాదయాత్ర, ఇంటింటి ప్రచారం
విజయవాడ : నేడు విజయవాడ పాయికాపురం 61వ డివిజన్ శాంతినగర్ ప్రాంతంలో సిపిఎం కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పాదయాత్ర నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ పాదయాత్ర, ఇంటింటి ప్రచారాన్ని బాబురావు ప్రారంభించారు. నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలతో కలిసి సిపిఎం కార్యకర్తలు ధర్నా ,ఆందోళన నిర్వహించారు. బియ్యం, కందిపప్పు.. నిత్యవసరాలు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ .... రాష్ట్ర సంపద సృష్టిస్తామని, ప్రజల ఆదాయాలు పెంచుతామని, పేదరికం నిర్మూలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను,పన్నులను పెంచుతూ ప్రజల జేబులు ఖాళీ చేయటం గర్హనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్తు , ఇంటి పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పెరగటం లేదు, ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి, ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని విమర్శించారు. ధరలను అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం.... తమ పార్టీ కార్యకర్తల ఆదాయాలను పెంచుతామని ప్రకటించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. టిడిపి కార్యకర్తల ఆదాయాలను సంవత్సరానికి 75 లక్షలు అంటే నెలకు ఆరు లక్షల రూ..లకు పైగా సమకూర్చుతామని ముఖ్యమంత్రి చెప్పటం అభ్యంతరకరమన్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధులు, పాలక పార్టీల నేతలు ... ప్రజలను దోచుకుంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. నేతల అవినీతితో పాటు కార్యకర్తలకు దోచిపెట్టడం కూటమి ముఖ్యమంత్రి ఉద్దేశమా ? అని ప్రశ్నించారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసే రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడటం ఆక్షేపణీయమన్నారు. సంపద సృష్టించటం అంటే నేతలు, కార్యకర్తల సంపద పెంచటమా ? కార్యకర్తల ఆదాయాలను ఎలా పెంచుతారు ? అవినీతికి పాల్పడే మార్గాలు చూపుతారా ? ప్రభుత్వ ఆస్తులను దోచిపెడతారా ? నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయటంపై దృష్టి పెట్టండి, పన్నుల భారాలను తగ్గించండి అని నినదించారు. కార్మికుల కనీస వేతనాలు పెంచండి, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వండి, నిరుద్యోగ యువతకు ఉపాధి చూపండి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పిఆర్సి ద్వారా వేతనాలు పెంచండి, బకాయిలు చెల్లించండి, వారి ఆదాయాలను ఆదాయాలను న్యాయంగా పెంచండి.... అంతేగాని కార్యకర్తల ఆదాయాలను పెంచుతానని చెప్పటం అన్యాయమన్నారు. రేషన్ డిపోల ద్వారా నిత్యవసర వస్తువులను చౌక ధరలకు పేద, మధ్యతరగతి ప్రజలకు అందించాలి, నాణ్యమైన సరుకులు ఇవ్వాలి, ప్రజలను ఆదుకోవాలన్నారు. విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు చార్జీలు, ఇంటి పన్నులు, మంచినీరు, డ్రైనేజీ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ,వంటగ్యాస్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించి... ప్రజలకు భారాలను నుండి ఉపశమనం కలిగించాలని కోరారు. స్థానిక ప్రజలు రేషన్ లో కోత, తూకాలలో తేడాలు, పెన్షన్ల మంజూరుకు నిబంధనలు, ఆటంకాలు, సూపర్ సిక్స్ హామీల అమలు ,సంక్షేమ పథకాల మంజూరులో లోపాలు తదితర అనేక సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. నేడు జరిగిన ఈ పాదయాత్ర ఇంటింటి ప్రచారంలో సిపిఎం నేతలు నగర నేతలు బి. రమణారావు, చింతల శ్రీనివాస్, పీర్ సాహెబ్, స్థానిక నేతలు అరుణ, ఎన్. శ్రీనివాస్, శ్రీరామ్, సత్యవతి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)