పారిస్ : హిందూ సంస్థకు చెందిన ప్రతినిధి బృందం సందర్శన సందర్భంగా మహిళా ఉద్యోగులను విధుల నుంచి పక్కన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఫిల్ టవర్ సిబ్బంది నిరసనకు దిగారు. దీంతో సోమవారం ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. యాజమాన్యం, సిబ్బంది మధ్య చర్చలతో ఈఫిల్ టవర్‌ను మంగళవారం నుండి తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులను పక్కనపెట్టాలని హిందూసంస్థకు చెందిన ప్రతినిధి బృందం కోరినట్లు ఈఫిల్ టవర్‌ను నిర్వహించే సంస్థ ‘ఎస్‌ఇటిఇ’ అంగీకరించింది. అయితే ఇటువంటి షరతులను తాము అంగీకరించకుండా ఉండాల్సిందని ఎస్ఇటిఇ పేర్కొంది.
తమ ప్రతినిధి బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించే సమయంలో మహిళా ఉద్యోగులను పక్కన పెట్టాలని బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బిఎపిఎస్) కోరినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో మహిళా ఉద్యోగులను విధుల నుంచి తప్పించారని పేర్కొన్నారు. వారి స్థానంలో పురుషులను నియమించడం, మహిళలను కనిపించకుండా ఉండాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈఫిల్ టవర్ సిబ్బంది తెలిపారు. ప్రతినిధి బృందానికి స్వాగతం పలికే సమయంలో మహిళా ఉద్యోగులు, కాంట్రాక్టర్ సంస్థల్లో పనిచేసే మహిళా సిబ్బంది కనిపించకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు. కొంతమంది మహిళా ఉద్యోగులను తమ విధులు నిర్వహిస్తున్న ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని కోరినట్లు సిబ్బంది పేర్కొన్నారు. కొన్ని చోట్ల వారి స్థానంలో పురుష ఉద్యోగులను నియమించారని, ప్రతినిధి బృందం ఈఫిల్ టవర్‌లో ఉన్న సమయంలో మహిళా ఉద్యోగులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల గుండా వెళ్లకూడదని కూడా ఆదేశించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యల పట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని సిబ్బంది పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)