- తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు అఖిలపక్షం మార్చ్...
- ప్రజాస్వామ్య పరిరక్షణకై ఒక్కటైన విపక్షాలు...
- సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
- ఎన్నికల కమిటీ సభ్యులు ఎన్నుకునే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అవకాశం ఇవ్వాలి..
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్.ఐ.ఆర్) లో భారీగా అక్రమాలు జరిగి లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి. దీనికి బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సిఈసి) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లోపభూయిష్టంగా సాగుతున్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా నిరసన ర్యాలీని చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి చారిత్రాత్మక లెనిన్ సెంటర్ వరకు శుక్రవారం అఖిల పక్ష నాయకులు, వామపక్ష కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేస్తూ ర్యాలీగా తరలివచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ... గాంధీని హత్య చేసిన ఆలోచనా విధానం ఉన్నవారే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, గాంధీకి నివాళులర్పించడం అంటే ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడమేనని అన్నారు. అమిత్ షా, మోదీ ద్వయం ఈ దేశాన్ని ఒక చెదలు పట్టిన పరిస్థితిలోకి తీసుకెళ్లారని, దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య స్వేచ్ఛను నాశనం చేస్తున్నారని విమర్శించారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ బిజెపి ఏజెంట్ అని డాక్యుమెంటరీతో రుజువైందని, ఆయన తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. 'ఫారమ్ 6' పేరుతో కొత్త ఓటర్లను, యువతను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని, మన రాష్ట్రంలోనే రెండున్నర లక్షల మంది కొత్త ఓటర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బిజెపికి తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయవద్దని, అలా చేస్తే బిజెపి తరహాలోనే వారి పార్టీకి కూడా అదే గతి పడుతుందని చంద్రబాబు నాయుడికి హితవు పలికారు.
మాజీ ఎంఎల్ఎ వైసిపి నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ... ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) ప్రారంభమైనప్పటి నుండి తమ పార్టీ ఎన్నికల కమిషన్‌కు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అనేక సందర్భాల్లో లోటుపాట్లను తెలియజేసినట్లు పేర్కొన్నారు. 2023లో తెచ్చిన ఎన్నికల చట్టం, ప్రధాన న్యాయమూర్తిని కమిటీ నుంచి తొలగించడంపై మొదటగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారని, ఈ చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఈవిఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు (18 సంవత్సరాలు నిండిన వారు), ఫారమ్-6 ప్రక్రియపై అధికారులు శ్రద్ధ పెట్టకుండా నెగ్లెక్ట్ చేశారని విమర్శించారు.
ఈ వేదిక/కమిటీ తీసుకునే ప్రతి నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేశారు. సిపిఐ జాతీయ కమిటీ సభ్యురాలు వనజాక్షి మాట్లాడుతూ... 1951 నుండి భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుండి ఇంతటి గందరగోళ పరిస్థితి ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. 2023 లో అమిత్ షా ఎన్నికలు కమిషనర్ ఎంపిక కమిటీలోకి వచ్చినప్పటి నుండి, అలాగే బిజెపి ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అశాస్త్రీయ పద్ధతుల్లో ఓట్లును తొలగించడం జరుగుతోందని ఆరోపించారు. దేశంలో 14 కోట్ల మంది ఓట్లను తొలగించడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్య హక్కు అని, ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని కోరారు. ఈ సందర్బంగా ఆమె ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యవాదులు, యువత అందరూ కలిసికట్టుగా పోరాడి ఎన్నికల వ్యవస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు నరహరి మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల ద్వారా వచ్చిన హక్కు అని తెలిపారు. 2023లో ప్రతిపక్ష నాయకుడు, దేశ ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఉండాలని కాంగ్రెస్ చెప్పినప్పటికీ, దానిని అమలు చేయలేదని విమర్శించారు.
స్వాతంత్రం వచ్చిన కొత్తలో జమీందార్లు, భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని, ఆ తర్వాత పండిట్ నెహ్రూ మరియు ఇతర పెద్దల ఆలోచనతో సామాన్యులకు కూడా ఒకే ఓటు హక్కు లభించిందని గుర్తుచేశారు. తొలగించిన ఓట్ల విషయంలో పునరాలోచన చేయాలని, ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మాజీ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పిలుపునిచ్చారు.
* ఎన్నికల వ్యవస్థపై విమర్శలు: ఈవీఎం (EVM) ల వినియోగం మరియు ఓటర్ల జాబితా లెక్కింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్లను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కేవలం సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం కాకుండా, అన్ని రాజకీయ పార్టీలు తమ కమిటీలలో ఈవీఎంల రద్దుపై తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అహింసాయుతమైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఊరూరా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎస్ఎస్ఆర్ ప్రక్రియ పేరుతో లక్షలాది ఓట్లను తొలగించడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే నియోజకవర్గంలో 2,96,000 ఓట్లు ఉంటే, సవరణల తర్వాత 1,71,000 ఓట్లకు పడిపోయాయని, అందులోనూ 80,000 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కవల పిల్లలకు లేదా తోబుట్టువుల మధ్య 9 నెలల వయసు తేడా లేదని కారణంతో, అలాగే తల్లికి-బిడ్డకు మధ్య సరైన వయసు వ్యత్యాసం లేదనే నెపంతో ఓట్లను తొలగించడం, ఆధారాలు అడగడం అన్యాయమని మండిపడ్డారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో వార్తలు వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు దానిని ఖండించారని, అలాగే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి మాట్లాడుతూ... 2014 నుండి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలు, కుట్రలు నగ్నంగా బయటపడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వం ఇంటింటికీ తిరిగిన ఓటు హక్కు కల్పించే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రజలే ఓటు కోసం అడిగేలా '6A' ఫారం పేరుతో అర్హతలను తొలగిస్తూ ఓటు హక్కుకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. సిపిఐ(ఎంఎల్) నాయకులు జాస్తి కిశోర్ బాబు మాట్లాడుతూ... అధికార మార్పిడి తప్ప.. నిజమైన స్వాతంత్ర్యం రాలేదన్నారు. 1948–50ల కాలంలోనే కమ్యూనిస్టు పార్టీ "ఇది కేవలం అధికార మార్పిడి మాత్రమే తప్ప నిజమైన స్వాతంత్ర్యం కాదు" అని స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తుచేశారు.
నేటికీ దేశంలో ప్రజాస్వామ్యం అనేది కేవలం పేరుకే పరిమితమైందని, లోపల నిరంకుశత్వమే రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు. రోజురోజుకూ ఈ విషయం అక్షరాలా రుజువవుతోందన్నారు. పాలకుల వర్గాలు, పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాద శక్తులు మరియు వారికి అనుకూలంగా వ్యవహరించే బడా భూస్వామ్య, బూర్జువా వర్గాలన్నీ కలిసి అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటికైనా తెగిస్తాయని మండిపడ్డారు. ఎస్ఐఆర్ (SIR) వంటి పరిణామాలు ఈ విషయాన్నే స్పష్టంగా రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. సిపిఐ లిబరేషన్ హరినాథ్ మాట్లాడుతూ.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ సాహసోపేతంగా వెలికితీసిన సంచలనాలు నేడు రాజకీయ నాయకుల్లో కలకలం రేపుతున్నాయన్నారు. బీహార్ లో దాదాపు 90 లక్షల ఓటర్ల తొలగింపుపై దీపాంకర్ భట్టాచార్య నాయకత్వంలో నిరసనలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. యోగేంద్ర యాదవ్ కూడా సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలోని అక్రమాలకు వ్యతిరేకంగా, అలాగే వలస కార్మికుల ఓట్ల తొలగింపుపై పోరాడారని పేర్కొన్నారు. మాస్ లైన్ భాస్కరరావు మాట్లాడుతూ... మన ముందు ముగ్గురు ముఖ్యమైన దేశద్రోహులు కనిపిస్తున్నారని, అందులో ఇద్దరు దేశద్రోహులు మరియు ఒకరు దిమాగీ దేశద్రోహి అని పేర్కొన్నారు. దేశద్రోహుల గ్యాంగ్‌కు పెద్ద నరేంద్ర మోదీ అని, ఎర్రకోట నుండి గతంలో ఏ ప్రధానమంత్రి మాట్లాడనంత చండాలంగా మాట్లాడారని విమర్శించారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజలను నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో అమిత్ షా భాగస్వామి అని, అలాగే వారి పథకాలను అమలు చేయడానికి ఎంచుకున్న జ్ఞానేష్ కుమార్ దిమాగీ దేశద్రోహి అని అన్నారు. సిపిఐ ఎంఎల్ రవీంద్ర మాట్లాడుతూ... గతంలో మనం మీటింగ్ లో పెడితే మాకు ఉద్యోగ హక్కు లేదు, లేకపోతే పని భద్రత లేదు, మా హక్కులను కాపాడండి, మా డిమాండ్లను నెరవేర్చండి అనేసి మనం విజ్ఞప్తి చేసేవాళ్లం. కానీ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఆయుధమైనటువంటి ఓటు హక్కే దొంగిలించబడింది అంటే దీనికంటే దౌర్భాగ్యం ఎక్కడ కూడా ఉండదన్నారు. దేశంలో 80 శాతం ఓట్లు ఉన్నటువంటి ప్రజలకి ద్రోహం చేస్తూ ఇవాళ ప్రజల ఓట్లను దొంగిలించడం అంటే వీళ్లను అర్జెంట్ గా అరెస్ట్ చేసి, ఈ ప్రభుత్వాన్ని వెంటనే సస్పెండ్ చేయాలి అనేసి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీళ్లకు తొత్తులుగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి టిడిపి గాని, జనసేన పార్టీలు కూడాను కళ్లు తెరవాలన్నారు. 400 సీట్లు మాకు ఇస్తే ఈ రాజ్యాంగాన్నే మార్చేస్తాం అన్నారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని వాళ్లకు మెజారిటీ ఇవ్వలేదన్నారు. ఎంసిపిఐ(యు) నాయకులు భాస్కర్ మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల కమిషనర్ (ఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే ఆయన పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అక్రమంగా తొలగించిన దాదాపు 13 కోట్ల ఓటర్ల పేర్లను వెంటనే తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని స్పష్టం చేశారు. అలాగే ఓటర్ల సర్వేను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ... డిక్టేటర్‌గా వ్యవహరించిన జ్ఞానేష్ కుమార్‌కి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నడిపే అర్హత లేదన్నారు. చట్టంలో సవరణ ద్వారా ఎలక్షన్ కమిషనర్‌కి లైఫ్‌లాంగ్ ఇమ్యూనిటీ (ఏం చేసినా చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు) కల్పించే క్లాజ్‌ను సవాలు చేస్తూ దాఖలైన కేసుపై సుప్రీంకోర్టు త్వరగా నిర్ణయించాలన్నారు. సుప్రీంకోర్టుకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి పూర్తి న్యాయం చేయాలని కోరారు. జెన్ జీ ప్రతినిధి మేఘనా రెడ్డి మాట్లాడుతూ... మన దేశం ప్రజాస్వామ్య దేశమని, రాజ్యాంగం అందరికీ ఓటు హక్కు గ్యారెంటీ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఓటు హక్కు విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తు కోసం జెన్ జీ సభ్యులంతా ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. తమ హక్కుల కోసం మరియు దేశ భవిష్యత్తు కోసం జెన్ జీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.











కామెంట్లు (0)