ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమి పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పండి : సిహెచ్.బాబూరావు

26 సెప్టెంబర్, 2026

Teach the alliance parties a lesson through your vote: Ch. Babu Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 02:37 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రజలపై పన్నుల భారాలు మోపి, అభివృద్ధిని కుంటుపరుస్తూ, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కూటమి పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పండి.

విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, పాత నగరంగా మారుస్తున్న కూటమి సర్కార్ ను నిలదీయండి

నగర పాలక సంస్థలో పదేళ్లు పన్నులు లేని ఆదర్శ పాలన అందించి, ప్రతిపక్షంగా ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు పోరు సాగించిన కమ్యూనిస్టులు, సిపిఎంకు అండగా నిలవండి.

ధన రాజకీయాల నేపథ్యంలో.. నగర అభివృద్ధి .. ప్రత్యామ్నాయ విధానాల కోసం.. స్థానిక ఎన్నికలలో.. కమ్యూనిస్టులు, అభ్యుదయ,లౌకిక శక్తులు, వ్యక్తులు ఏకం కావాలి, ఉమ్మడి పోరు సాగించాలి.


విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో .... సిపిఎం విజయవాడ నగర విస్తృత సమావేశం సిపిఎం కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాబూరావు, డి.వి.కృష్ణ, కాశీనాథ్ మాట్లాడుతూ ... రాబోయే ఎన్నికలలో.. నగరాన్ని, రాష్ట్రంలో పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలపై పన్నుల భారాలు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓటుతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై గళం విప్పాలన్నారు. అధికారాలను కేంద్రీకృతం చేస్తూ.. స్థానిక సంస్థలను దెబ్బతీస్తున్న కేంద్ర,రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాలకు స్థానిక ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని కోరారు. ఎన్నికల కమిషన్ ని పావుగా వాడుకుంటూ.. ప్రజల ఓటు హక్కును హరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను నిలదీయాలని, ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్రానికి మద్దతునిస్తున్న పార్టీలు కళ్ళు తెరవాలని అన్నారు. విజయవాడ నగరంలో పాలక పార్టీలు నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా ప్రజలపై భారాలు మోపుతున్నారనీ, ఆఖరికి జి.ఓ 673 తీసుకువచ్చి నగరాలను అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. విజయవాడ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు పాలించిన పార్టీలు నగరాన్ని అధోగతి పాలు చేశాయని విమర్శించారు. విజయవాడ నగరంలో పదేళ్లు వామపక్షాలు ఆదర్శపాలన అందించాయని తెలిపారు. పన్నుల భారాలు లేకుండా నగర సమగ్రాభివృద్ధికి కృషి చేశాయని, ప్రతిపక్షంగానూ ప్రజా వాణిని వినిపించాయని గుర్తు చేశారు. నగరాభివృద్ధిని కోరుకునే అభ్యుదయ, లౌకిక శక్తులు, వామపక్షాలు రాబోయే ఎన్నికల్లో అన్ని వార్డులలోను, మేయర్ స్థానానికి ఉమ్మడి కృషి చేయాలని.. ఇందుకోసం పార్టీ శ్రేణులు, అభిమానులు పూనుకోవాలని సమావేశం పిలుపునిస్తుందని బాబూరావు అన్నారు. అమరావతితో సమాంతరంగా.. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. 11 వేల కోట్ల రూపాయలతో పట్టణాలలో అభివృద్ధి పనులు ప్రకటించి, అందులో నగరానికి కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. ఇళ్ళ పట్టాల సమస్య నగరంలో తీవ్రంగా ఉన్నదని, సుమారు లక్ష కుటుంబాలు పట్టాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కృష్ణా కరకట్ట, కాలువ కట్టలు, కొండ ప్రాంత పట్టాలు అర్జీలు పెట్టుకున్న అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. బుడమేరు వరదల నేపథ్యంలో ముంపు నివారణ చర్యలు చేపట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలకే పరిమితమయ్యారని అన్నారు. వర్షాలు పడితే నగర ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జి.ఓ నెం.673 తీసుకువచ్చి నగరంలో ఉన్న కీలకమైన ,విలువైన స్థలాలను కార్పోరేట్ సంస్థలకు అమ్మకానికి పెడుతున్నారని, ఇప్పటికే భవాని ద్వీపం 130 ఎకరాలను లీజుకు ఇచ్చారని తెలిపారు. ఆస్తిపన్ను పెంచబోమని, సమీక్ష జరుపుతామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ప్రతి ఏటా ఆస్తిపన్ను పెంచుతున్నారని అన్నారు. ఇప్పటికే ఆరేళ్లలో 130% పైగా ఆస్తిపన్ను పెరిగిందన్నారు. దొడ్డి దారిన మరలా చెత్త పన్ను వేసేందుకు సన్నాహాలు ప్రారంభించారని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని బాబూరావు మండిపడ్డారు. ధనార్జనే ప్రధాన కర్తవ్యంగా పదవులను వాడుకుంటున్నారని, వారికున్న పదవులు సరిపోనట్లు వారి కుటుంబ సభ్యుల పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. సిపిఎం, వామపక్షాలు పదేళ్ల నగర పాలనలో.. పన్నుల భారాలు లేకుండానే అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. బూస్టర్ల ద్వారా కొండలపైకి నీళ్లు, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు నిర్మించడం స్టేడియాలు, పార్కులు ఏర్పాటు అభివృద్ధి చేసిందన్నారు. ప్రజా సమస్యలపై నికరంగా పని చేస్తున్న సిపిఎం, వామపక్షాలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. డబ్బు, కుల, మత రాజకీయాలకు అతీతంగా నిజాయితీగా, ప్రజల కోసం పనిచేస్తున్నవారిని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ కార్యదర్శి బి.సత్యబాబు, సెంట్రల్ కార్యదర్శి బి.రమణారావు, తూర్పు కార్యదర్శి పి.కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు దుర్గారావు, నారాయణ, క్రాంతి, ప్రవీణ్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్