అమరావతితో పాటు సమాంతరంగా విజయవాడ నగర అభివృద్ధిపై పాలకులు ఎందుకు దృష్టి పెట్టరు ?
విజయవాడను పాత నగరంగా వదిలేసిన ప్రజాప్రతినిధులు
కొత్త ఇళ్ల నిర్మాణాలపై అనధికార టాక్స్ లు కోట్లాది రూ.. వసూళ్లు చేసిన నేతలకు, పార్టీలకు బుద్ధి చెప్పండి
కమ్యూనిస్టుల హయాంలోనే విజయవాడ నగర అభివృద్ధి... కమ్యూనిస్టులకు అండగా నిలవండి : సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వర్గ సభ్యులు డి కాశీనాథ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
విజయవాడ : నేడు గవర్నర్ పేటలోని సిపిఎం కార్యాలయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం.. నగర కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల సమావేశం కే.దుర్గారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బాబురావు, కాశీనాథ్ మాట్లాడారు. సిపిఎం నేతలు బి.రమణ రావు,టి. ప్రవీణ్, ఎం.సీతారాములు, చింతల శ్రీనివాస్, ఎస్కే పీర్ సాహెబ్, వై.సుబ్బారావు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక నేతలు, కార్యకర్తలు.. అధిక ధరలు, విద్యుత్ ఛార్జీల భారం, ఇంటి పన్నుల పెంపు తదితర అంశాలపై ప్రజాగ్రహాన్ని వివరించారు. నగరపాలక సంస్థలో పరిస్థితులు అద్వాన్నంగా మారాయని, దిగజారాయని...తెలిపి.. కలుషితనీరు, దిగజారిన పారిశుధ్యం, దోమల బెడద, అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం.. తదితర సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన సాగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో బాబురావు, కాశీనాథ్ మాట్లాడుతూ ... విజయవాడ నగర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, నగరానికి ప్రయోజనం కలిగించే ఏ ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టలేదు. విజయవాడ నగరపాలక సంస్థను అప్పుల ఊబిలో దించారు, కాంట్రాక్టర్లకు వందలాది కోట్ల రూ.. బిల్లులు చెల్లించలేదు, పనులు నిలిపివేశారు, సమ్మె చేశారు, టెండర్లు వేసే నాధుడే లేడు, టెండర్లు పిలిచిన పనులను రద్దు చేశారు, నగరాన్ని తీవ్ర సంక్షోభంలోకి పాలకులు నెట్టారు. అమరావతి తో పాటు విజయవాడ ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి మాటలు చెప్పడం తప్ప... నగరానికి నిధులు ఇచ్చింది లేదు... విజయవాడ నగరంలో వసూలు చేసిన పన్నులను.. రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుని, సకాలంలో విడుదల చేయడం లేదు, నిధులను దారి మళ్ళిస్తున్నది. విజయవాడకు రావలసిన నిధులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కూటమి ప్రజాప్రతినిధులు పెదవి విప్పటం లేదు, నిధులు సాధించలేక అసమర్థులుగా మిగిలిపోయారు. సొంత సంపాదనే తప్ప.. నగర ప్రజల ప్రయోజనాలు వారికి పట్ట లేదు. నూతన భవన నిర్మాణాలపై నేతలు 10 వేల నుండి 10 లక్షల రూపాయల వరకు బలవంతంగా అనధికార టాక్స్ లు వసూలు చేస్తున్నారు, ప్రజలను వేధిస్తున్నారు. అధికారులు ఒకవైపు, నేతలు మరోవైపు ప్రజలను పీక్కు తింటున్నారు. ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారు, పేదల కొరకు కట్టిన ఇళ్లను పంచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. నేడు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్, కార్పొరేట్ పదవుల కోసం ఆరాటపడుతున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ప్రజలను పీడించి, అవినీతికి పాల్పడుతున్న నేతలకు, పార్టీలకు బుద్ధి చెప్పండి. విజయవాడ నగర పాలక సంస్థ గౌరవ ప్రతిష్టలను మంటగలిపిన నేతలను, పార్టీలను నిలదీయండి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పాలకులకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత ఉందా ? అని ప్రశ్నించారు. విజయవాడ నగరపాలక సంస్థలో 10 సంవత్సరాలు పాటు అధికార బాధ్యతలు నిర్వహించిన కమ్యూనిస్టుల హయాంలోనే నగరం అభివృద్ధికి నోచుకున్నది, మురికివాడలు, కొండ ప్రాంతాలతో సహా బాగుపడ్డాయి. పన్నులు పెంచకుండా నగర సమగ్ర అభివృద్ధి కమ్యూనిస్టుల నేతృత్వంలో జరిగింది, నగరపాలక సంస్థ లో ఆదర్శవంతమైన పాలన జరిగింది. నగరపాలక సంస్థలో ప్రతిపక్షంలో ఉండి ప్రజలపై భారాలకు వ్యతిరేకంగా,ప్రజలకు హాని చేసే సంస్కరణలకు నిరసనగా కమ్యూనిస్టులు పోరాడారు, ప్రజలకు అండగా నిలిచారు. మాట తప్పి ప్రజలకు ద్రోహం చేస్తూ సొంత ప్రయోజనాలకే పరిమితమైన నేతలకు, పార్టీలకు గుణపాఠం నేర్పితేనే పాలకులలో మార్పు వస్తుంది, విజయవాడ నగరానికి మేలు జరుగుతుంది. నగరాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులు, శక్తులు ఏకం కావాలి,ధన రాజకీయాలకు ప్రత్యామ్నాయం చూపాలి, సిపిఎం, కమ్యూనిస్టులకు అండగా నిలవండి.








కామెంట్‌లు (0)