ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు రూ. 42 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించే చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడిని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం. మహేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారంలో భాగంగా కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం మంగళవారం మచ్చర్ పాయింట్ వద్ద నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్‌ను ఎం. మహేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని విమర్శించారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్, ఫ్యాక్టరీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, తోపుడు బండ్ల కార్మికులు, భవన నిర్మాణ, ముఠా కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు రూ.21 వేల కనీస వేతనం అమలు చేయాలని కోరారు. కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ ముట్టడి కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షుడు జి. సురేష్, కార్యదర్శి టి. కృష్ణ, కోశాధికారి బి. నవీన్, సిఐటియు ఉపాధ్యక్షులు దేవుళ్లు, అప్పారావు, రమణ, సంయుక్త కార్యదర్శులు లక్ష్మణ్, ప్రసాద్, కమిటీ సభ్యులు రత్నారావు, మణికంఠ, రాజు, సూర్యలక్ష్మి, అప్పలరత్నం, నాగమణి, నాగలక్ష్మి, మాణిక్యం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)