కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు
ప్రజాశక్తి-పల్నాడు : నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలోని ఏఎంరెడ్డి కళాశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్‌ను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ సంజనా శ్రీహర్ష తెలిపారు.
కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది, గుర్తింపు పొందిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కేంద్రంలోకి అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం వెలుపల కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం అధికారికంగా ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు అధికారులకు సహకరించాలని జాయింట్ కలెక్టర్ కోరారు.







కామెంట్‌లు (0)