రెంటచింతల:
రానున్న సర్పంచ్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అడహళ్ళి పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రమైన రెంటచింతల పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు, గత ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు, వాటికి సంబంధించి నిందితుల వివరాలు, బైండోవర్ కేసుల నమోదు తదితర అంశాలపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల తీరును సమీక్షించడంతో పాటు, డిసెంబర్ 2న మండలంలోని 11 గ్రామాల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
అనంతరం పోలీస్‌స్టేషన్ పరిసరాలను, వివిధ కేసులకు సంబంధించి స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న సర్పంచ్ ఎన్నికల నిర్వహణను పోలీసు యంత్రాంగం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, అల్లర్లకు పాల్పడేందుకు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గురజాల డీఎస్పీ ఎం. మహేశ్వరరావు, కారంపూడి సీఐ ఆవుల భాస్కర్, రెంటచింతల ఎస్ఐ సీహెచ్. నాగార్జున తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)