రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశం
ప్రజాశక్తి – రాజవొమ్మంగి(అల్లూరి) : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని పోలవరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పత్రాల పరిశీలన వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం ఉదయం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. నామినేషన్ గదిలోకి అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని, ఒకేసారి ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్లు కేటాయించి, వచ్చిన క్రమంలో నామినేషన్లు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణతోపాటు పత్రాల పరిశీలనను సమాంతరంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పత్రాల్లో లోపాలుంటే అభ్యర్థులకు తెలియజేసి, నిబంధనల పరిధిలో వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. అభ్యర్థులకు అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి జాప్యం లేకుండా జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల ముందే ర్యాలీలను నిలిపివేయాలని, నిబంధనల ప్రకారం అభ్యర్థులను మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు. ఎన్నికల భద్రతకు సంబంధించి పోలీసు అధికారులకు ముందుగానే సమాచారం అందించాలని, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, చింతూరు సబ్ కలెక్టర్ చిట్టపులి నరేంద్ర పడాల్, జడ్పీ సీఈవో కె. పురుషోత్తం, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)