గిరిజన రైతులు చేపల పెంపకంతో అదనపు ఆదాయం పొందాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్కుమార్ అన్నారు. జిల్లాలో గిరిజన మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచి, మత్స్య సంపదను పెంపొందించడమే లక్ష్యంగా పీఎంఎంఎస్వై, డీఏ-జేజీయూఏ పథకాల కింద చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం ముసురుమిల్లి రిజర్వాయర్ పరిధిలోని సీతపల్లి పాత వంతెన సమీపంలో జాగారంపల్లి వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన రైతులు తమ సొంత పొలాల్లో చేపల చెరువులు (ఫామ్పాండ్లు) తవ్వుకునేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సామూహిక మత్స్య సంపద అభివృద్ధితోబాటు వ్యక్తిగత భూముల్లోనూ చేపల పెంపకం, ఆక్వాకల్చర్ను ప్రోత్సహిస్తే గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆక్వాకల్చర్ అభివృద్ధి చెంది, చేపలు, రొయ్యల ఉత్పత్తులు అమెరికా వంటి దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయని గుర్తుచేశారు. పోలవరం జిల్లాలోనూ మత్స్య సంపద అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో గుర్తించిన 9 జలవనరుల్లో మొత్తం 4,10,400 చేప పిల్లలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్య వనరులను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా శాఖాపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరపాటి ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, మత్స్యశాఖ ప్రధాన కార్యాలయం పరిశీలకులు లాల్ మొహమ్మద్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్.కె. దిల్షాద్, మత్స్య అభివృద్ధి అధికారులు కె. హరీష్, తహశీల్దార్ సిహెచ్ బాలాజీ, ఎంపీడీవో ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు, పంచాయతీ కార్యదర్శి భారతి, టి.వి.రవికుమార్, గ్రామ సహాయకులు, గిరిజన మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఫోటో రైటాప్.rjvm01.చేప పిల్లలను విడుదల చేస్తున్న అధికారులు.








కామెంట్లు (0)