ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపిపి, జెడ్‌‌పి చైర్మన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

10 నవంబర్, 2026

ఎంపిపి, జెడ్‌‌పి చైర్మన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ
19న మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 20న జిల్లా పరిషత్తు చైర్‌‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 07:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

19న మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 20న జిల్లా పరిషత్తు చైర్‌‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌


పోలవరం జిల్లాలోని 12 మండల ప్రజా పరిషత్‌లు, ఒక జిల్లా ప్రజా పరిషత్‌లో కో-ఆప్షన్‌ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్లు జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ‌కె.దినేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. ఈ నెల 19వ తేదీన మండల ప్రజా పరిషత్తుల్లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికతో పాటు ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 20న జిల్లా పరిషత్‌లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికతో బాటు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు నిర్ణీత తేదీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారన్నారు. ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారని, ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, మరొకరిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారని తెలిపారు. ప్రతి మండల పరిషత్‌లో ఒక కో-ఆప్షన్‌ సభ్యుడిని, జిల్లా పరిషత్‌లో ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. కో-ఆప్షన్‌ సభ్యులు మతపరమైన మైనారిటీ లేదా భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులై ఉండాల‌న్నారు. మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల కంటే ముందుగా కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను నిర్వహిస్తారని తెలిపారు. ఎంపీపీ, వైస్‌ ఎంపిపి, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు జరిగే ఎన్నికలను చేతులు పైకెత్తి ఓటు వేసే విధానంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల సందర్భంగా సంబంధిత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు జారీ చేసే పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. అయితే కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల విషయంలో పార్టీ విప్ వర్తించదని పేర్కొన్నారు. మండల, జిల్లా పరిషత్‌లకు ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా ఉన్న పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యేందుకు ఆహ్వానించబడతారని తెలిపారు. అయితే వారికి ఈ పరోక్ష ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులను ఈ నెల 14వ తేదీలోగా అందచేయడం జరుగుతుందన్నారు. పరోక్ష ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా,ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమగ్ర మార్గదర్శకాలు, విధివిధానాలను జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. పోలవరం జిల్లాలోని 12 మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లో పరోక్ష ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు దినేష్ కుమార్ వెల్లడించారు.

ఫోటో రైటాప్.rjvm01. జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్