ప్రజాశక్తి-రాజవొమ్మంగి:
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, స్థానిక సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ,యువతకు మెరుగైన అవకాశాల కల్పన, క్రీడా ప్రతిభను వెలికితీయడం, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పోలవరం జిల్లాలో నాలుగు వినూత్న అభివృద్ధి ప్రాజెక్టులను ప్రతిపాదించినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్‌కుమార్ వెల్లడించారు. గురువారం రంపచోడవరం ఐటిడిఎ సమావేశ మందిరం నుంచి నీతి ఆయోగ్ కార్యక్రమాల అమలు, అభివృద్ధి సూచికల పురోగతి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, లక్ష్యాల సాధన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని సూచించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, కళలు, జీవన విధానాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఎక్స్పీరియన్స్ పార్క్ అండ్ మ్యూజియం ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో గిరిజన మ్యూజియం భవనం, ప్రదర్శన గ్యాలరీలు, బహిరంగ ప్రదర్శన ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
శిఖర్ : గిరిజన యువత నైపుణ్యాలు, ఆరోగ్యం, క్రీడాభివృద్ధి కేంద్రం,గిరిజన యువతలో శారీరక దృఢత్వం, క్రీడా నైపుణ్యాలు, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ఉపాధి, భవిష్యత్ అవకాశాలకు అవసరమైన శిక్షణ అందించేందుకు రంపచోడవరం కేంద్రంగా శిఖర్ (స్కిల్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కైనెటిక్స్ అండ్ అజిలిటీ రిసోర్స్ హబ్) ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.
మా ఊరి మైదానం : జిల్లాలోని 12 మండలాల్లో 50 గ్రామాల్లో 139.41 ఎకరాల విస్తీర్ణంలో గ్రామీణ క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామీణ యువత, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడం, బాలబాలికలు,గిరిజన విద్యార్థులకు మెరుగైన క్రీడా వాతావరణం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు.
మోడల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాలనీ అభివృద్ధి ప్రాజెక్టు: జిల్లాలోని పునరావాస కాలనీల్లో నివసిస్తున్న కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ హాల్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీ, లెర్నింగ్ సెంటర్, క్రీడా మైదానాలు, పిల్లల ఆట స్థలాలు, ఓపెన్ జిమ్, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు అనువైన సురక్షిత నడక మార్గాలు, సోలార్ విద్యుత్, వీధి దీపాలు, పచ్చదనం, కూర్చునే ప్రదేశాలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.పునరావాస కాలనీల్లో ముందుగా ప్రాథమిక సర్వే నిర్వహించి, ప్రజల అవసరాలు, అభిప్రాయాల ఆధారంగా అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఎఐ జ్యోతి : పాఠశాల విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఎఐ)పై అవగాహన కల్పించేందుకు ‘ఎఐ జ్యోతి’ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, యువతలో నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ,క్రీడా ప్రతిభ వెలికితీతతో పాటు పునరావాస కాలనీల్లో మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టుల అమలులో జిల్లా యంత్రాంగంతో పాటు పునరావాస శాఖలు, ఇంజినీరింగ్ విభాగాలు, విద్యాశాఖ, క్రీడలు, యువజన శాఖలు, గ్రామపంచాయతీలు, స్థానిక నివాసితుల కమిటీలు సమన్వయంతో భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్రావు, ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారులు లవన్ రెడ్డి, హేమ మాధురి, కృష్ణ, మధుర పాల్గొన్నారు.







కామెంట్లు (0)